నోట్ల ప్రభావం నిల్: స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా
మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల మొదటి దశలో బీజేపీ భారీ విజయాలు సాధించింది. మొత్తం 164 స్థానిక సంస్థల్లో 851 వార్డు/ డివిజన్ సీట్లు గెలుచుకుంది. దీంతో రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్‌సీపీలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ముఖ్యంగా, పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజల్లో కేంద్రంలోని అధికార బీజేపీ మీద వ్యతిరేకత ఉందా.. లేదా అనే విషయాన్ని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయని పార్టీ నాయకులు అంటున్నారు. మొత్తం 147 మునిసిపాలిటీలు, 17 నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వాటిలోని 3,510 వార్డుల స్థానాలకు ఫలితాలు ప్రకటించారు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. మునిసిపల్ చైర్మన్ ఎన్నికలు ప్రత్యక్షంగా జరిగిన చోట్ల.. బీజేపీ అభ్యర్థులు 52 చోట్ల గెలవగా, ప్రతిపక్షాల అభ్యర్థులు కేవలం 6 చోట్ల మాత్రమే విజయం సాధించారు. ఎన్‌సీపీ, కాంగ్రెస్ కంచుకోటలుగా భావించినచోట్ల కూడా బీజేపీ గెలిచింది. ప్రకటించిన వార్డు స్థానాలలో మొత్తం 851 సీట్లను బీజేపీ గెలుచుకోగా, శివసేనకు514, ఎన్‌సీపీకి 638, కాంగ్రెస్‌కు 643, ఎంఎన్ఎస్‌కు 16, బీఎస్పీకి 9, ఇతరులకు 119, స్థానిక కూటములకు 384, సీపీఎంకు 12, స్వతంత్రులకు 324 సీట్లు వచ్చాయి. అయితే ప్రధానంగా చైర్మన్ స్థానాలు చాలావరకు బీజేపీ సాధించింది. గత ఎన్నికల్లో బీజేపీకి 298, శివసేనకు 264, కాంగ్రెస్ పార్టీకి 771, ఎన్‌సీపీకి 916 స్థానాల చొప్పున వచ్చాయి.
మహారాష్ట్రలోని 25 జిల్లాల్లో జరిగిన ఈ మునిసిపల్ ఎన్నికలను అందరూ మినీ అసెంబ్లీ ఎన్నికలుగా భావించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పాపులారిటీ ఏ మేరకు ఉందన్న విషయం కూడా దీంతో తేలిపోతుందని చాలామంది ఎన్నికలకు ముందు వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్, ఎన్‌సీపీ పాతుకుపోయి ఉండగా, ఫడ్నవీస్ గ్రామాల్లోకి కూడా చొచ్చుకుపోయారు. దానివల్లే స్థానిక సంస్థలపై పట్టు సాధించగలిగారని పరిశీలకులు అంటున్నారు. ఇక పెద్దనోట్ల రద్దు కారణంగా బీజేపీ మీద పడుతుందని భావించిన ప్రజా వ్యతిరేకత కూడా పెద్దగా కనిపించకపోవడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం.
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులకు ప్రధాని అభినందనలు తెలిపారు. క్షేత్రస్థాయిలో చేసిన కార్యక్రమాలు ప్రజల్లో బీజేపీ పట్ల విశ్వాసాన్ని పెంచాయని ప్రధాని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకున్న ప్రతిపక్షాలకు ఇదో గుణపాఠమని అమిత్ షా అన్నారు. ఆయన కూడా పార్టీ కార్యకర్తలు, నాయకులకు అభినందనలు తెలిపారు.