సాక్షి, న్యూఢిల్లీ : యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్ ట్రైలర్‌పై దుమారం రేగుతున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధానికి తెరలేపాయి. మన్మోహన్ సింగ్‌ను ముందుపెట్టి కాంగ్రెస్ పది సంవత్సరాల పాటు దేశాన్ని దోచుకున్న తీరుకు ఇది అద్దం పడుతోందని బీజేపీ వ్యాఖ్యనించగా, నాలుగున్నరేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుతూ ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. అనుపమ్ ఖేర్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంపై మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అభ్యంతరాలను లేవనెత్తడంపై బీజేపీ స్పందించింది. 2004 నుంచి 2008 వరకూ మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు గతంలో రాసిన పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.
2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు యూపీఏ అంతర్గత రాజకీయాలకు బలైన బాధితుడిగా మన్మోహన్ సింగ్‌ను చిత్ర ట్రైలర్‌లో చూపించడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ సినిమా వివాదాస్పదం కావడంతో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలను మన్మోహన్ సింగ్ దాటవేశారు. యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్ అధికారిక ట్రైలర్నువీ క్షించాలని బీజేపీ ఈ సినిమా ట్రైలర్‌ను ట్వీట్ చేసింది. 2014 ఏప్రిల్‌లో ఇదే అంశంపై పుస్తకం వెలువడగా, ఆ బుక్ ఆధారంగా రూపొందిన సినిమాపై అభ్యంతరం ఎందుకని కాంగ్రెస్‌ను కమలనాధులు ప్రశ్నిస్తున్నారు. అయితే బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ దీటుగా స్పందించింది.
ఐదేళ్ల పాలనలో ఎలాంటి విజయాలు సాధించని బీజేపీ ప్రజల దృష్టిని మరల్చేందుకు సరికొత్త డ్రామాకు తెరతీసిందని కాంగ్రెస్ ఎంపీ పీఎల్ పూనియా వ్యాఖ్యానించారు. ఈ సినిమాను బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకుంటుందా అన్న ప్రశ్నలకు టైటిల్ రోల్ పోషించిన అనుపమ్ ఖేర్ బదులిస్తూ తాను రాజకీయాల్లో ఉంటే కచ్చితంగా ఆ పని చేస్తానని స్పష్టం చేశారు. తాను నటుడినని, దీనిపై బీజేపీయే ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. తాము పుస్తకం ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించామని చెప్పుకొచ్చారు. విజయ్ రత్నాకర్ గుటె నిర్ధేశకత్వంలో రూపొందిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment