మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ రాజకీయంగా దుమారం రేపుతోంది. బుధవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను బీజేపీ తన అధికార ట్విట్టర్ హ్యాండిల్‌లో పెట్టి ‘ ఒక కుటుంబం పదేళ్ల పాటు దేశాన్ని తన గుప్పిట్లో ఎలా ఉంచుకుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది’ అని వ్యాఖ్యానించడంతో వివాదం రాజు కుంది. 2004–08 మధ్య మన్మోహన్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మన్మోహన్ పాత్రలో నటించారు. ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది.
మన్మోహన్ రాజప్రతినిధా?: బీజేపీ
సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నుంచి మన్మోహన్ ఒత్తిడి ఎదుర్కొంటున్న దృశ్యాలను ప్రచార చిత్రంలో చూపడం కాంగ్రెస్‌కు ఆగ్రహం తెప్పించింది. ట్విట్టర్ వేదికగా ఈ సినిమాపై విమర్శలు, వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు విస్తృతంగా వ్యాపించాయి. ‘ఒక కుటుంబం ఏకంగా పదేళ్ల పాటు దేశాన్ని ఎలా గుప్పిట్లో పెట్టుకుందో చెప్పే సినిమా ఇది. వారసుడు సిద్ధమయ్యే వరకు ఆ కుటుంబం డా.సింగ్‌ను రాజ ప్రతినిధిగా పీఎం కుర్చీపై కూర్చోపెట్టిందా? యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ట్రైలర్ చూడండి’ అని బీజేపీ తన అధికార ట్విట్టర్‌లో పేర్కొంది.
కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ ‘ ఇప్పటి మొద్దు ప్రధాని(మోదీ)పై వాళ్లు(కాంగ్రెస్) సినిమా తీసేదాకా వేచి ఉండలేకపోతున్నా. యాక్సిడెంటల్ ప్రధాని కన్నా ఇన్సెసిటివ్ ప్రధాని ప్రమాదకరం’ అని ట్వీట్ చేశారు. ‘బీజేపీని చూస్తే జాలేస్తోంది. నాలుగన్నరేళ్లుగా మోదీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సమున్నతుడైన మన్మోహన్ సింగ్‌పై సినిమాను స్పాన్సర్ చేశారు. మీరు ఆ మేధావికి సరితూగలేరు. కనీసం ఆయన విలువల్ని పాటించడానికైనా ప్రయత్నించండి‘ అని రాహుల్ సోదరి ప్రియాంక ట్వీట్ చేశారు.
సృజన ప్రయత్నాన్నే చూడండి: ఖేర్
ఈ సినిమాను సృజనాత్మక కోణంలో చేసిన ప్రయత్నంగా చూడాలి తప్ప, ఓ రాజకీయ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లుగా భావించొద్దని అనుపమ్ ఖేర్ అన్నారు. ఈ చిత్రం తన కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శనగా నిలిచిపోతుందని తెలిపారు. మన్మోహన్ పాత్ర పోషణ తనకు పెద్ద సవాలుగా మారిందని, దీనికోసం ఆరు నెలలు శ్రమించానని అన్నారు. మన్మోహన్ హావభావాలు, ముఖ్యంగా ఆయన గొంతు అనుకరించడానికి చాలా కష్టపడ్డానని, అందుకోసం ఆయనకు సంబంధించిన వీడియోల్ని గంటల కొద్దీ చూశానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment