ప్రాంతాన్నే విడదీస్తాం.. ప్రజల్ని కాదు : వెంకయ్య నాయుడు
పాట్నా/కోల్‌కతా: ఆంధ్రప్రదేశ్‌లో తాము ప్రజల్ని విడదీయబోమని, కేవలం తెలంగాణ ప్రాంతాన్ని మాత్రమే విడదీసేందుకు సమ్మతిస్తామని బీజేపీ స్పష్టం చేసింది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారా అక్కడి ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని మండిపడింది. బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు పాట్నాలో విలేకరులతో మాట్లాడుతూ... ‘మేం ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలనుకుంటున్నాం. ప్రజలను కాదు’ అని ఆయన అన్నారు. తొమ్మిదేళ్లకు పైగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో సమర్థంగా వ్యవహరించలేక పోయింద ని దుయ్యబట్టారు.
ఎన్నికల కోసమే తెలంగాణ: మమత
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రూపొందించిన నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం వెనుక ఎన్నికలు, రాజకీయ కారణాలే ఉన్నాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ‘ఇది పూర్తిగా రాజకీయ, ఎన్నికల నిర్ణయం’ అని మమత తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. గత ఐదేళ్ల కిందటి సాధారణ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశం పరిగణనలోకి వచ్చిందని, తిరిగి ఐదేళ్లు ముగిసి, ఎన్నికలు రానున్న సమయంలో ఇది కార్యరూపం దాల్చడం పూర్తిగా రాజకీయమేనని మమత పేర్కొన్నారు. కాగా, పశ్చిమబెంగాల్‌లోని గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయాలనే డిమాండ్‌ను మమత వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.