
లక్నో : ముఖానికి మాస్క్ పెట్టుకోవాలని చెప్పినందుకు పోలీసులపై ఓ బీజేపీ నేత విరుచుకుపడ్డారు. అధికార పార్టీకి చెందిన తనకే సూక్తులు చెప్తావా అంటూ దాడికి పాల్పడారు. ఈ ఘటన శనివారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక డీఎస్పీ ప్రభాకర్ చౌదరి ఘటన వివరాలను వెల్లడించారు. బీజేపీ నేత సురేందర్ పటేల్ అతని కుమారుడు వికాస్ ముఖాలను మాస్కులు లేకుండా బయట తిరుగుతున్నారు. దీనిని గమనించిన స్థానిక పోలీసులు వారి వద్దకు వెళ్లి మాస్కులు ధరించాలని సూచించారు. దీంతో చిర్రెత్తిన తండ్రీకొడుకులు అక్కడున్న ముగ్గురు పోలీసు అధికారులపై దాడికి పాల్పడ్డారు. వీరిలో ఓ ఎస్సై కూడా ఉన్నారు. పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. ఘటనలో గాయపడ్డ పోలీసులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై వారణాసి బీజేపీ చీఫ్ మహేష్ చంద్రా శ్రీవాస్తవా మాట్లాడుతూ.. కరోనాపై పోరులో ముందున్న పోలీసులపై దాడికి పాల్పడం సరైనది కాదని అన్నారు. ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.