ఆర్మీలోకి అనురాగ్ ఠాకూర్!
బీజేపీ ఎంపీ, బిసిసిఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ త్వరలో ఆర్మీలో చేరబోతున్నారు. టెరిటోరియల్ ఆర్మీ అధికారిగా నూతన ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన పరీక్షను, ఇంటర్వూను, పూర్తి చేసిన ఆయన.. తన కల ఇన్నాళ్ళకు సాకారం కానుందని, మిలటరీ డ్రెస్ వేసుకోవాలని, దేశ భద్రతకు తనవంతు సేవ అందించాలన్న కోరిక తీరనుందని ఠాకూర్ వెల్లడించారు.
అనురాగ్ ఠాకూర్ త్వరలో ఆర్మీ దుస్తుల్లో కనిపించనున్నారు. టెరిటోరియల్ ఆర్మీ అధికారిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఆయన.. దానికి సంబంధఙంచిన పరీక్షను, ఇంటర్వ్యూను పూర్తి చేశారు. బీజేపీ ఎంపీగా, బీసీసీఐ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన... టెరిటోరియల్ ఆర్మీలో రెగ్యులర్ ఆఫీసర్ గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించి, మిలటరీ లో చేరిన మొదటి బీజేపీ ఎంపీగా రికార్డు సృష్టించనున్నారు. తాతగారు ఆర్మీలో పనిచేయడంతో తనకు ఆర్మీలో చేరాలన్న కోరిక బలంగా ఉండేదని, అయితే అనుకోకుండా తన కెరీర్ క్రికెట్, పాలిటిక్స్ మార్గంలోకి మారిపోయిందని ఠాకూర్ తెలిపారు.
టెరిటోరియల్ ఆర్మీలో రెగ్యులర్ ఆఫీసర్ గా శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్న 41 ఏళ్ళ ఠాకూర్.. ఛండీగర్ లో నిర్వహించిన పర్సనల్ ఇంటర్వ్యూలో అర్హత పొందిన అనంతరం, భోపాల్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమిత్ పూర్ నుంచి లోక్ సభ మెంబర్ గా ఎన్నికయిన ఠాకూర్.. టెరిటోరియల్ ఆర్మీలో అర్హతకోసం ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నారు. డిఫెన్స్ లో రెగ్యులర్ ఆర్మీ తర్వాతి స్థానంలో ఉన్న టెరిటోరియల్ ఆర్మీలో.. సుమారు నెల నుంచి సంవత్సరంపాటు ప్రత్యేక మిలటరీ ట్రైనింగ్ తీసుకున్న వాలంటరీర్లను తీసుకొని, అత్యవసర పరిస్థితుల్లో దేశ భద్రతకోసం వినియోగించుకుంటారు.
దేశానికి సేవ చేయాలన్న తన కల ఇన్నాళ్ళకు నిజం కాబోతోందని, ఆర్మీ యూనిఫాం ధరించేందుకు ఎంతో తహ తహగా ఉందని ఠాకూర్ ఈ సందర్భంలో తెలిపారు. భద్రతా దళాల్లోని ఎన్నో సమస్యలను ఇప్పటిదాకా బయటినుంచే చూడగల్గుతున్నానని, ఇప్పుడు వాటిని దగ్గరినుంచీ చూడటమే కాక, ఎంపీగా సమస్యలను వెలుగులోకి తెచ్చి, వాటి సాధనకోసం పనిచేసే అవకాశం ఉందని తెలిపారు.