కరువుతో అల్లాడుతున్నాం.. ఐపీఎల్ మ్యాచ్‌లొద్దు!
ముంబై: 'ఒక్క క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మైదానం నిర్వహణ కోసం కనీసం ఎంతలేదన్న 80వేల నుంచి లక్ష లీటర్ల నీరు అవసరమవుతుంది. రాష్ట్రం అసలే కరువుతో అల్లాడుతున్నది. గత వంద ఏళ్లలో ఎన్నడూలేని కరువు రాష్ట్రంలో తాండవిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల నడుమ రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం సబబు కాదు. కాబట్టి ఈ మ్యాచ్‌లను వేరే రాష్ట్రానికి మార్చండి' అంటూ ముంబై బీజేపీ కార్యదర్శి వివేకానంద గుప్తా బీసీసీఐ ప్రెసిడెంట్ శశాంక్ మనోహర్‌కు లేఖ రాశారు.
ఏప్రిల్ 9 నుంచి మే 29 వరకు ముంబై, పుణె, నాగ్‌పూర్ లలో మొత్తం 19 ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌ల సందర్భంగా మైదానాల నిర్వహణకు ఎంతలేదన్న 70 లక్షల లీటర్ల నీటిని వినియోగించాల్సి ఉంటుంది. గత వంద ఏళ్లలో ఎన్నడూ చూడని కరువుతో మహారాష్ట్ర అల్లాడుతున్న నేపథ్యంలో రాష్ట్రవాసి అయిన శంశాక్ మనోహర్ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ మ్యాచ్‌లను బదలాయించాలని గుప్తా కోరారు. కరువుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం సరికాదని, కరువు పరిస్థితుల పట్ల బీసీసీఐ గుడ్డిగా వ్యవహరించజాలదని ఆయన తన లేఖలో అన్నారు.