ఏమి కావాలో మీరే తేల్చుకోండి:బీసీసీఐ
ముంబై:మహారాష్ట్ర నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్లను తరలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల వరకూ నష్టం వాటిల్లుతుందని ఇప్పటికే పేర్కొన్న బీసీసీఐ.. మరో అడుగు ముందుకేసి రాష్ట్రానికి ఆదాయం కావాలో, నీరు కావాలో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బీసీసీఐలోని సీనియర్ అధికారి ఒకరు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 'మీరే తేల్చుకోండి. మీకు నీరు కావాలా? లేక ఆదాయం కావాలా?అంటూ ప్రభుత్వానికి సూచించారు. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ లపై సందిగ్ధత నెలకొంది.
మహారాష్ట్రలో ఏర్పడిన కరువు, నీటి కొరత కారణంగా ఐపీఎల్ మ్యాచ్లకు నీరు ఇచ్చేదిలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. ఈ ఏడాదికి ఐపీఎల్ మ్యాచ్ లు మహారాష్ట్ర నుంచి తరలిపోయినా తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ పెద్దలు మ్యాచ్ ల నిర్వహణపై మల్లగుల్లాలు పడుతున్నారు. అప్పటికప్పుడు షెడ్యూల్ మార్చడం అంత సులభం కాదని పేర్కొంటున్నారు.
మరోవైపు మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్లను తరలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల వరకు నష్టం ఏర్పడుతుందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ముంబై, పుణె, నాగ్పూర్ వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ ఐపీఎల్ సీజన్లో మహారాష్ట్రలో 18 మ్యాచ్లు జరగాల్సివుండగా, మ్యాచ్ ల నిర్వహణ అంశంపై బాంబే హైకోర్టుకు చేరింది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్, పుణె సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్ కు కోర్టు అనుమతినిచ్చింది. అయితే ఇక్కడ నిర్వహించే మిగతా ఐపీఎల్ మ్యాచ్ల పై తదుపరి విచారణ ఈ నెల 12 వ తేదీన జరుగనుంది.