
వారధి వేదికగా బాహాబాహీ..
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ, ఆప్ శ్రేణుల మధ్య ఘర్షణకు దేశ రాజధానిలో సిగ్నేచర్ వారధి ప్రారంభోత్సవం వేదికగా మారింది. ఈ బ్రిడ్జి పునర్నిర్మాణానికి తాము చొరవ తీసకుంటే స్ధానిక ఎంపీనైన తనను ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల సమక్షంలోనే బీజేపీ, ఆప్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. తన నియోజకవర్గ పరిధిలో ఈ బ్రిడ్జి పునర్నిర్మాణానికి తాను చొరవ తీసుకున్నానని, తాను వారధి నిర్మాణానికి ఎంతో కృషి చేస్తే ప్రస్తుతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభిస్తున్నారని అన్నారు.
తివారీ వేదిక వద్దకు చేరుకోగానే బీజేపీ, ఆప్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆప్ కార్యకర్తలు, పోలీసులు తన పట్ల దురుసుగా వ్యవహరించారని తివారీ ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ను స్వాగతించేందుకు తాను ఇక్కడికి వస్తే పోలీసులు, ఆప్ శ్రేణులు తనను నేరస్తుడిలా చుట్టుముట్టాయని ఆరోపించారు.
మరోవైపు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆప్ వాలంటీర్లను, స్ధానికులను నెట్టివేసి రాద్ధాంతం చేశారని ఆప్ నేత దిలీప్ పాండే పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఆహ్వానం లేకపోయినా హాజరయ్యారని, తివారీ తనకు తాను వీఐపీలా భావిస్తున్నారని పాండే అన్నారు.