రూ. 50 కోట్లు ఆఫర్ చేశారు
డెహ్రాడూన్: ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఉత్తరాఖండ్ రాజకీయం వేడిక్కింది. తమకు 50 కోట్ల రూపాయలు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందంటూ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాంబు పేల్చారు. ఎమ్మెల్యేలు రాజేంద్ర భండారి, జీత్ రామ్ ఈ సంచలన ఆరోపణలు చేశారు.
'50 కోట్ల రూపాయల వరకు డబ్బు ఇస్తామని బీజేపీ నాయకులు ప్రలోభపెట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్, రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పారు' అంటూ ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో చెప్పారు. వీరిద్దరితో పాటు డిప్యూటీ స్పీకర్ అనుసూయ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీని వీడుతారంటూ వచ్చిన వార్తలను ఖండించారు. బీజేపీ నాయకుడు సత్పాల్ మహారాజ్తో ఉన్న సంబంధాలు వ్యక్తిగతమైనవని, రాజకీయపరమైనవి కావని భండారి, జీత్ రామ్ స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు 2.5 కోట్ల నుంచి బేరం మొదలుపెట్టి 50 కోట్ల రూపాయలకు పెంచారని, తమను ఎవరూ కొనలేరని భండారి చెప్పారు.
వీరి ఆరోపణలను బీజేపీ ప్రతినిధి మున్నాసింగ్ చౌహాన్ ఖండిస్తూ.. ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో బేరసారాలాడుతూ ముఖ్యమంత్రి హరీష్ రావత్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని, తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాఖండ్లో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ సంక్షోభం ఏర్పడంతో రాష్ట్రపతి పాలన విధించారు.