బలనిరూపణ ఆగింది.. హైకోర్టు కీలక ఉత్తర్వులు!
డెహ్రాడూన్: ఈ నెల 31న (గురువారం) ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష నిర్వహించాల్సిందిగా సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఈ వ్యవహారంపై వాదనలను ఏప్రిల్ 6వ తేదీకి వాయిదా వేసింది. రాజకీయ సంక్షోభం నెలకొన్న ఉత్తరాఖండ్‌లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించగా.. దానిని తోసిపుచ్చుతూ సింగిల్ జడ్జి ధర్మాసనం.. గురువారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులపై ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ హైకోర్టు ఉన్నత ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. ఈ కేసులో సోమవారం, లేదా మంగళవారం తమ సమాధానాన్ని తెలియజేస్తామని ఆ రెండు పార్టీలు న్యాయస్థానానికి తెలియజేయడంతో.. వాదనలను ఏప్రిల్ ఆరుకు వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ వీకే బిషత్ కూడిన డివిజనల్ బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రపతి పాలన విధించి.. అసెంబ్లీలోని సూప్తచేతనావస్థలో ఉంచిన తర్వాత సభలో బలనిరూపణ పరీక్ష నిర్వహంచడం సాధ్యమా అంటూ దాఖలైన ఈ పిటిషన్‌పై కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత బలనిరూపణ పరీక్ష కోసం అసెంబ్లీని పునరుద్ధరించడం కుదరబోదన్న రోహత్గీ వార్తలతో ఏకీభవించిన ధర్మాసనం.. బలనిరూపణ పరీక్షపై స్టే విధించింది.