న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై మంగళవారం లోక్‌సభలో బీజేపీ, సీపీఎంలు నిప్పులు చెరిగాయి. ఆయన క్షమాపణ చెప్పకపోతే అభిశంసన తీర్మానం తెస్తామని బీజేపీ హెచ్చరించింది. తృణమూల్ ఎంపీ ఒకరు రెండు రోజుల కిందట పశ్చిమ బెంగాల్‌లో మాట్లాడుతూ మోదీపై, దివంగత ప్రధాని లాల్ బహద్దూర్‌శాస్త్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎస్‌ఎస్ అహ్లూవాలియా(బీజేపీ) సభలోనే ఉన్న బెనర్జీ పేరు ప్రస్తావించకుండా చెప్పారు. ఆయన సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు సీపీఎం సభ్యులు మహమ్మద్ సలీం, శ్రీమతి టీచర్‌లు మద్దతు పలికారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు.. బెనర్జీ ఏమన్నారో చెబుతూ తొలిసారి ఆయన పేరు ప్రస్తావించారు.
2019లో ప్రజలు మోదీని చెంపదెబ్బ కొట్టి తిరిగి గాంధీనగర్‌కు పంపుతారని, ఇక ఆయన అక్కడి నుంచి తిరిగిరారని బె నర్జీ చెప్పారన్నారు. అలాగే, శాస్త్రి జీవించి ఉంటే తన మనవడి చర్యలను(బెంగాల్ బీజేపీ ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్) చూసి పెళ్లి చేసుకున్నందుకు విచారపడేవాడని అన్నారని తెలిపారు. సభ సజావుగా సాగేందుకు బెనర్జీ తనంతట తాను బేషరతు క్షమాపణ చెప్పాలన్నారు. వెంకయ్య.. బెనర్జీ పేరును ప్రస్తావించడంపై తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోపక్క.. మోదీ, ఇతర నాయకులపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కల్యాణ్ బెనర్జీల వ్యాఖ్యలు పౌర విలువలకు వ్యతిరేకమని బీజేపీ పార్లమెంటరీ పార్టీ మంగళవారం నాటి సమావేశంలో ఖండించింది. కాగా, అభిశంసన తీర్మానం తెస్తామని ప్రభుత్వం బెదిరించినా బెనర్జీ వెనక్కి తగ్గలేదు. రాజకీయ ప్రసంగంలో ఆ వాఖ్యలు చేశానని, వాటిలో తప్పేమీ లేదు కనుక క్షమాపణ చెప్పనని అన్నారు.