ఇలా చేయడం చంద్రబాబుకు కొత్తేంకాదుగా! | TMC MP Kalyan Banerjee Comments on Chandrababu PM Modi | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. ఇలా మేనేజ్‌ చేయడం చంద్రబాబుకు కొత్తేంకాదుగా!

Published Sat, Jul 6 2024 10:03 AM | Last Updated on Sat, Jul 6 2024 10:46 AM

TMC MP Kalyan Banerjee Comments on Chandrababu PM Modi

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన సింహగర్జనకు లోక్‌సభ దద్దరిల్లింది. ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీపైన, బీజేపీపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఆ పార్టీలో చేరితే వాషింగ్ మిషన్‌లో వేసినట్లేనా?అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మహారాష్ట్ర ఎన్సీపీ చీలికవర్గం నేతలు అజిత్ పవార్, ప్రఫుల్ల పటేల్ లపై ఉన్న ఆరోపణలను ప్రస్తావించి వారంతా బీజేపీలో చేరగానే నీతిమంతులు అయిపోయారా అని నిలదీశారా? చంద్రబాబు ను సీబీఐ, ఈడీ ఎందుకు అరెస్టు చేయలేదని బెనర్జీ ప్రశ్నించారు. 

చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ షేర్ విలువ హటాత్తుగా పెరిగి ఒకరోజులోనే 521 కోట్ల సంపద వచ్చిందని, ఈ వ్యవహారాలపై దర్యాప్తు చేయరా అని అడిగారు. బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కనుక వీరంతా పునీతులు అయిపోయినట్లేనా? అవినీతిపరులు నితిమంతులు అయినట్లేనా? అని ఆయన అన్నారు. నిజానికి ఇంత కీలకమైన ప్రశ్నకు మోదీ స్పష్టమైన సమాధానం ఇచ్చి ఉండాల్సింది. కాని ఈ విషయంలో ఆయన కూడా నైతికంగా దెబ్బతిన్నారని చెప్పక తప్పదు. బీజేపీతో కలవకముందు అజిత్‌ పవార్ కాని, ప్రఫుల్ల పటేల్ కాని పలుమార్లు ఈడీ విచారణను ఎదుర్కోవలసి వచ్చింది. బీజేపీతో సంబంధం పెట్టుకోగానే, ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది.. అలాగే ఈడి గోల కూడా పోయింది. చంద్రబాబు విషయం చూస్తే మరీ ఆసక్తికరం అని చెప్పాలి. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, మోదీలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మోదీని టెర్రరిస్టు అని, అవినీతి పరుడని, భార్యనే ఏలుకోలేని వాడు దేశాన్ని ఏమి ఏలుతాడని పలుమార్లు ధ్వజమెత్తారు.

మోదీ సైతం 2019 ఎన్నికల ప్రచారం సమయంలో చంద్రబాబును ఉద్దేశించి ఆరోపణలు చేస్తూ పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని అన్నారు. ఆ ఎన్నికలలో టీడీపీ ఓటమితో చంద్రబాబు లైన్ మార్చి మళ్లీ మోదీని ఆకట్టుకోవడానికి పలు ఎత్తుగడలు వేశారు. తొలుత మోదీ ఇష్టపడలేదు. ఆదాయపన్ను శాఖ చంద్రబాబు పీఎ ఇంటిలో సోదాలు చేసి రెండువేల కోట్ల రూపాయల విలువైన అక్రమాలు జరిగాయని తేల్చినట్లు సిబిటిడి ప్రకటించింది. అంతేకాక ఆదాయపన్ను శాఖ చంద్రబాబుకు కొన్ని అక్రమాలకు సంబంధించి నోటీసులు కూడా ఇచ్చింది. ఆయన ఏదో సాకు చూపుతూ తప్పించుకునే యత్నం చేశారు. ఈలోగా మోదీతో మధ్యవర్తుల ద్వారా మంతనాలు సాగించి తన జోలికి రాకుండా చేసుకోగలిగారు. అది ఆయన మొదటి సక్సెస్ అని చెప్పవచ్చు. విశేషం ఏమిటంటే లోక్ సభలో వైఎస్సార్‌సీపీకి అప్పట్లో 19 మంది సభ్యులు ఉండేవారు. అయినా వారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ స్థాయిలో చంద్రబాబుపై వచ్చిన అభియోగాల గురించి బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసినట్లు అనిపించదు. 

చంద్రబాబుపై గత ఏపీ ప్రభుత్వంలో సిఐడి పలు అవినీతి కేసులు నమోదు చేసి ఈడి, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోలేదు. ఒకవైపు దేశంలో అవినీతిని అంతం చేస్తానంటూ కబుర్లు చెప్పే మోదీ ఇలా చేస్తున్నారేమిటా అని అనుకోవడం తప్ప ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అప్పటికే చంద్రబాబు తెలివిగా తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీను బీజేపీలో విలీనం చేయించారు. వారిలో ఇద్దరు భారీ ఎత్తున బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులలో ఉన్నారు. బీజేపీలో చేరగానే వారంతా మోదీ ఎదుట కూర్చుని కబుర్లు చెప్పగలిగారు. తదుపరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ముందుగా బీజేపీ అధిష్టానం వద్దకు పంపించి పొత్తు కుదిరేలా చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ద్వారాను, బీజేపీలో ఉన్న తన కోవర్టుల ద్వారాను బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, జెపి నడ్డాలను ఎలాగైతేనేం ఒప్పించి టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదిరేలా చేయగలిగారు. ఏపీకి బీజేపీ అధ్యక్షురాలిగా వచ్చిన దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఈ విషయంలో తన వంతు సాయం చేసి అధిష్టానం పై ఒత్తిడి తీసుకు వచ్చారు. 

ఈ రకంగా చంద్రబాబు తెలివిగా మోదీని , ఇతర బీజేపీ అగ్రనేతలను తనదారిలోకి తెచ్చుకున్నారు. దాంతో ఆయనపై అన్నివేల కోట్ల ఆరోపణలు వచ్చినా, ఏపీకి చెందిన ఒరిజినల్ బీజేపీ నేతలు ఎంత తీవ్రమైన విమర్శలు చేసినా చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబును ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈడి అప్పటికే ఆ కేసులో కొందరిని అరెస్టు చేసినా, చంద్రబాబు జోలికి రాలేదు. ఇంకో సంగతి కూడా చెప్పాలి. డిల్లీ లిక్కర్ స్కామ్ అంతా కలిపి వంద కోట్లు ఉంటుందో, నిజంగా ఎవరికైనా ముడుపులు ముట్టాయో లేదో కాని, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ,మాజీ ఎమ్.పి కవిత వంటివారు నెలల తరబడి జైలులో ఉంటున్నారు. న్యాయ వ్యవస్థ సైతం వారికి ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదో అర్ధం కాదు.ఇదే డిల్లీ లిక్కర్ కేసులో కీలకమైన వ్యక్తిగాఈడి పరిగణించి విచారణ చేసిన లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వైసిపి టిక్కెట్ ఇవ్వకపోతే టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. ఆయన గెలిచి మోదీతో కలిసి ఫోటో దిగారు.ఇలాంటివాటిని చూస్తే ఏమనిపిస్తుంది. 

ఈ దేశంలో అధికార పార్టీలో ఉంటే ఏ కేసునుంచి అయినా తప్పించుకోవచ్చు. అదే ప్రత్యర్ధి పార్టీలో ఉంటే నిజంగా అవినీతి జరిగినా,జరగకపోయినా ఈడి,సీబీఐ వంటివి వెంటబడే అవకాశం కూడా ఉంటుందన్న భావన ప్రజలలో ఏర్పడుతోంది. ఇవే కాదు.పశ్చిమబెంగాల్ లో శారదా చిట్ ఫండ్ స్కామ్ లోను, నారదా స్టింగ్ ఆపరేషన్ లోను కొందరు టీఎంసీ నేతలను సీబీఐ ఆరెస్టు చేసింది. వారు ఆ తర్వాత బీజేపీలో చేరగానే దాదాపు వారంతా సేఫ్ అయ్యారు. ఇలా ఆయా రాష్ట్రాలలో మోదీ ఇదే గేమ్ ఆడుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఈసారి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం అయిందని చెప్పవచ్చు. తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలకు మోదీ ఎన్నడూ సమాధానం చెప్పలేదు.అలాగే మోదీ తనపై చేసిన అవినీతి అభియోగాలకు చంద్రబాబు జవాబు ఇవ్వలేదు. ఇప్పటికి అదే పరిస్థితి కొనసాగుతోంది. అయినా వారు జట్టు కట్టగలిగారు. కాంగ్రెస్ పార్టీ తన సొంత పార్టీవారిపై సీబీఐ, ఈడి వంటివాటిని ప్రయోగించి నష్టపోతే, మోదీ మాత్రం ఎదుటిపార్టీవారిపై ఈ సంస్థలను ఉపయోగించి అధికారం నిలబెట్టుకునే యత్నం చేస్తున్నారన్న భావన ఏర్పడింది.పార్లమెంటులో కళ్యాణ్ బెనర్జీ చేసిన ఆరోపణలపై మోదీ నేరుగా స్పందించలేకపోయారు. 

తన ప్రభుత్వం అవినీతిపై జీరో టాలరెన్స్ తో ఉందని మోదీ చెప్పినప్పటికీ,అందుకు ఆధారాలు చూపలేకపోయారు.ఇది ఒక ఎత్తు అయితే చంద్రబాబు గొప్పదనాన్ని ఒప్పుకోక తప్పదు. అదేమిటంటే చంద్రబాబు పై అంత పెద్ద ఆరోపణ లు లోక్ సభలో వస్తే సంబంధిత వార్తలను తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటిలోనే కాకుండా, ఆంగ్ల పత్రికలలో సైతం రాకుండా చేయగలిగారు.ఆయన మేనేజ్ మెంట్ స్కిల్ ఆ స్థాయిలో ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు. జర్నలిజం విలువల గురించి ఉపన్యాసాలు ఇచ్చే ఎన్.రామ్ నాయకత్వంలోని హిందూపత్రిక సైతం ఇందుకు అతీతంగాలేదు. ఒకప్పుడు ఎమర్జెన్సీపై పోరాడిన గోయాంకకు చెందిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఈ వార్తలు ఇవ్వలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికలదీ ఇదే దారి . హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందిన వెలుగు, బీఆర్ఎస్ కు చెందిన నమస్తేతెలంగాణ వంటి పత్రికలు సైతం ఈ వార్తను విస్మరించాయంటే ఏమని అనుకోవాలి. వామపక్షాల పత్రికలలో కూడా ఈ వార్త ప్రముఖంగా కనిపించలేదు.

చంద్రబాబు పై టీఎంసీ చేసిన ఆరోపణలపై టీడీపీ ఎంపీ శబరి స్పందించారు. ఆమె గతంలో ఆదాయపన్ను శాఖ చేసిన సోదాలు, సిబిటిడి ప్రకటన, చంద్రబాబుకు ఇచ్చిన నోటీసు గురించి ప్రస్తావించకుండా గత ఎన్నికలలో టీడీపీ గెలిచిందని ,నంద్యాల వంటి చోట్ల కూడా గెలుపొందామని, టీడీపీ ప్రభుత్వం వచ్చిందని చెప్పుకొచ్చారు. అవినీతి ఆరోపణలకు ,ఈ గెలుపునకు సంబంధం ఏమిటో తెలియదు. 2015లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి వ్యూహం పన్ని ,అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి టీడీపీ ప్రయత్నించిందని ఆరోపణ వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కేసులో అరెస్టు అయ్యారు. అదే కేసులో చంద్రబాబుపై కూడా తీవ్ర అభియోగాలు రావడం, ఆయన వాయిస్ ఆడియో ఒకటి లీక్ కావడం సంచలనం అయింది. ఆ వెంటనే ఆయన డిల్లీ స్థాయిలో చక్రం తిప్పి తన జోలికి కెసిఆర్ ప్రభుత్వం రాకుండా చేసుకోగలిగారు. 

అది చంద్రబాబు విశిష్టత. ఎక్కడ ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో చంద్రబాబుకు తెలిసినంతగా దేశంలో మరే నేతకు తెలియదన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. దానికి తోడు పరిస్థితులు కూడా ఆయనకు కలిసి వస్తుంటాయి. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడం, టీడీపీ, జెడియు పార్టీ వంటి పార్టీల మద్దతు అవసరం కావడంతో ,అప్పటికే ఈ పార్టీలతో పొత్తు పెట్టుకున్నందున వారికి ప్రాధాన్యత కూడా పెరిగింది.అందువల్లే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మోదీ సరసన చంద్రబాబు కూడా కూర్చోగలిగారు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదని కళ్యాణ్ బెనర్జీ ప్రశ్నిస్తే మాత్రం ఏమవుతుంది! ఏమి కాదని తేలిందని అనుకోవచ్చా! సోషల్ మీడియాతో పాటు, సాక్షి వంటి ఒకటి ,రెండు మీడియాలు తప్ప ఇంకేవి వార్తనే ఇవ్వలేదు. అది చంద్రబాబు నైపుణ్యం అని ఒప్పుకోక తప్పదు.

– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

 

 




 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement