ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
- ఓటమి తప్పదని ఆ పార్టీలో ఆందోళన: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఓటమిని తప్పించుకోడానికే బీజేపీ విష రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అలాగే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాబోదని జోస్యం చెప్పారు. ఢిల్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి కాబట్టే బీజేపీ అగ్రనేతలంతా ప్రచారానికి దిగారని పేర్కొన్నారు. ఈ నెల 7న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పీటీఐ వార్తా సంస్థకు అరవింద్ కేజ్రీవాల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ ఆందోళనలో ఉన్నందువ ల్లే ఆ పార్టీ నేతలు తనపై, తన కుటుంబం, వర్గంపై ఆరోపణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆ పార్టీలో పెరుగుతున్న నిరాశానిస్పృహలకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని ఓ చర్చిపై దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. ఎన్నికల ఆఖరి దశలో బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడి ఓటర్లను చీల్చుతుందని, గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో ఇదే వ్యూహాన్ని అనుసరించిందని వ్యాఖ్యానించారు.
తాము ప్రేమ, వాత్సల్యంతో కూడిన రాజకీయాలు చేస్తే.. బీజేపీ మాత్రం విషపూరిత రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. తన ప్రత్యర్థి, బీజేపీ సీఎం అభ్యర్థిని కిరణ్ బేడీపై స్పందిస్తూ.. ఆమె ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్‌లో మౌనం దాల్చిన మన్మోహన్‌సింగ్‌లాగే ఉండిపోతారన్నారు. ఐపీఎస్ మాజీ అధికారిగా ఆమె పోలీస్ ఉద్యోగానికే సరిపోతారని, సీఎం పోస్టుకు తగరని వ్యాఖ్యానించారు.