
కోల్‌కత : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు-2020లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 70 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే 45 స్థానాల్లో విజయం సాధించిన ఆప్.. మరో 17 చోట్ల స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక వరుసగా మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయబోతున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అభినందనల వెల్లువ మొదలైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దాంతోపాటు బీజేపీ పతనం మొదలైందని ఓ ర్యాలీలో మాట్లాడుతూ అన్నారు.
(చదవండి : ఆప్ విజయంలో ‘బిర్యానీ’ పాత్ర)
క్రమక్రమంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలహీన పడటం ప్రారంభమైందని, త్వరలోనే కాషాయ దళం ప్రభ కోల్పోతుందని మమత పేర్కొన్నారు. వచ్చే యేడాది జరగుబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ చిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ఢిల్లీ విద్యార్థులను, మహిళలను టార్చర్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు కాషాయ దళానికి తగిన శాస్తి చేశారని చురకలంటించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 చోట్ల విజయం సాధించగా, 5 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక దశాబ్దాల పాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు వచ్చేలా కనిపించడం లేదు.
చదవండి :
న్యూఢిల్లీలో కేజ్రీవాల్ విజయం
ఢిల్లీ ఫలితాలు : ప్రశాంత్ కిశోర్ స్పందన
Comments
Please login to add a commentAdd a comment