నల్ల జాతకాలు బట్టబయలు
సుప్రీంకోర్టుకు సమర్పించిన బీజేపీ ప్రభుత్వం
అఫిడవిట్ రూపంలో మొత్తం 627 పేర్ల వెల్లడి
తామే దర్యాప్తు చేయిస్తామన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తెగేసి చెప్పడంతో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం నల్ల కుబేరుల జాబితాను బయటపెట్టింది. మొత్తం 627 మంది పేర్లతో కూడిన ఈ జాబితాను అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు సర్కారు సమర్పించింది. జాబితాలో పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, వాణిజ్యవేత్తలు.. ఇలా అన్ని వర్గాల వాళ్లు ఉన్నారు. అందరూ వేలకోట్లలోనే తమ సంపదను విదేశాల్లోని పలు బ్యాంకుల్లో వేర్వేరు ఖాతాలలో దాచిపెట్టుకున్నారు. ఈ మొత్తం వివరాలను సేకరించినా.. ఆయా దేశాలతో ఉన్న ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందం కారణంగా తాము చర్యలు తీసుకోలేకపోతున్నట్లు బీజేపీ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పింది.
అయితే.. మన దేశానికి చెందిన సొమ్ము విదేశాలకు ఇలా తరలిపోవడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, దీనిపై ఎలా దర్యాప్తు చేయించాలో తమకు తెలుసునని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. జాబితా మొత్తాన్ని.. ఒక్క పేరు కూడా తీయకుండా తమకు సమర్పించాలని, అది కూడా బుధవారమే ఇవ్వాలని మంగళవారం నాడు తేల్చిచెప్పింది. దాంతో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈ జాబితాను అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పించారు. అయితే భద్రతా కారణాల రీత్యా ఈ పేర్లను బయటపెట్టొద్దని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సుప్రీంకోర్టుకు మంగళవారమే విజ్ఞప్తి చేశారు.