బ్లాక్ మనీ లిస్ట్ను సుప్రీంకు సమర్పించిన కేంద్రం
న్యూఢిల్లీ : నల్ల కుబేరుల జాబితాగా కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. 627మంది పేర్లతో మూడు సెట్లుగా కొత్త జాబితాను సీల్డ్ కవర్లో అందించింది. తొలి సెట్లో కేంద్రం వద్ద ఉన్న జాబితా, రెండో సెట్లో విదేశాల్లో ఖాతా వున్న వ్యక్తుల వివరాలు, మూడో సెట్లో ఇప్పటివరకు చేపట్టిన విచారణ వివరాలను పొందుపరిచింది. ఈ మూడు సెట్లను అటార్నీ జనరల్(ఏజీ) ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు సమర్పించారు. 2006 వరకు ఉన్న స్విస్ ఖాతాల వివరాలను అందులో పేర్కొన్నారు. కాగా జాబితాలోని 220 మందిపై సిట్ దృష్టి పెట్టనుంది.
నల్ల కుబేరుల జాబితాగా పేర్కొంటూ ఎనిమిది మంది పేర్లతో కూడిన అఫిడవిట్‌ను సోమవారం సుప్రీంకు కేంద్రం సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది పేర్లనే వెల్లడించి.. మిగతావారి విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. దీంతో సుప్రీం ఆదేశాలను పాటిస్తామని, తమ వద్దనున్న మొత్తం పేర్లన్నింటితో పూర్తి జాబితాను కోర్టుకు సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.