సాక్షి, ముంబై : నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల పరీవాహక ప్రాంతాల్లో వర్షం చాలా తక్కువగా కురవడంతో నీటి సమస్య తీవ్రమైంది. దీన్ని అధిగమించేందుకు నీటి పొదుపు తప్ప వేరే మార్గం లేదు. ఇందుకు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నడుంబిగించింది. నగరవాసుల్లో వివిధ పద్ధతుల ద్వారా అవగాహన కల్పించనుంది. నగరంలో శుక్రవారం భారీగా వర్షం కురిసినప్పటికీ జలాశయ పరీవాహక ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది.
నగర శివారు ప్రాంతాల్లో 36 శాతం వర్షపాతం నమోదు కాగా, నగరంలో 42 శాతం వర్షపాతం నమోదైందనీ వాతావరణ శాఖ వెల్లడించింది. జలాశయాల నీటి మట్టం తగ్గుతోం ది. ఈ క్రమంలో ఇప్పటికే 20 శాతం నీటి కోత విధిస్తున్నప్పటికీ కేవలం 22 రోజులకు మాత్రమే సరిప డా నీరు జలాశయాల్లో ఉండడంతో కార్పొరేషన్ అధికారులు ఆగమేఘాల మీద నీటి పొదుపు తక్షణ అవసరంగా భావిస్తున్నారు.
స్పెషల్ డ్రైవ్
మొదట కార్పొరేషన్ ఉన్న నీటి వనరులను పొదు పు ఉపయోగించుకోవాల్సిందిగా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా నగర వాసుల్లో అవగాహన కల్పించనుంది. నీటిని ఎలా పొదుపు చేయాలన్న అంశాలను కార్పొరేషన్ పలు సూచనలు చేయనుంది. నీటిని పొదుపు గా ఉపయోగించేందుకు చేపట్టే ప్రత్యేక డ్రైవ్‌లో ప్రకటనలు, వీధి నాటకాల ప్రదర్శనతోపాటు ఎన్జీఓల సహాయాన్ని కూడా తీసుకోనున్నారు. ప్రకటనల ద్వారా తెలియజేసే కార్యక్రమంలో ప్రముఖులను కూడా చేర్చనున్నారు. 2009లో కూడా ఇదే తరహా లో నీటి సమస్య నెలకొనడంతో క్రికెట్ లెజెండ్ సచి న్ టెండుల్కర్ బీఎంసీ ప్రచారంలో పాల్గొని నీటిని వృథా చేయడాన్ని నిషేధించాలని ప్రచారం నిర్వహించారు. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో ప్రచారానికి పూనుకుంది.
రోజూ నీటి సరఫరా చేయలేం : అడిషనల్ మున్సిపల్ కమిషనర్
నగరానికి నీటిని సరఫరా చేసే ఆరు జలాశయాల్లో నీటి మట్టం చాలా తక్కువగా నమోదైంది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే నగరానికి రోజు నీటిని సరఫరా చేయడం కుదరదని అడిషినల్ మున్సిపల్ కమిషనర్ రాజీవ్ జలోటా తెలిపారు. నీటి పొదుపు, వృథా వల్ల కలిగే లాభ నష్టాలను వీడియో క్లిప్పింగ్‌ల ద్వారా పాఠశాల విద్యార్థులు, హౌజింగ్ సొసైటీలకు చూపించనున్నారు. ఈ క్లిప్పింగ్‌లను యూట్యూబ్‌లో కూడా వయా వాట్సా ప్ ద్వారా పంపించనున్నారు. ఈమెయిల్ ఐడీకి కూడా క్లిప్పింగ్‌లను పంపించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటనలను రైల్వే స్టేషన్లు బెస్ట్ బస్సులో కూడా అమర్చనున్నారు. తమ బృందం లో కొంత మంది వీధి నాటకాలు కూడా వేయనున్నారని డిప్యూటీ హైడ్రాలిక్ ఇంజినీర్ ఎ.ఎస్.తవాడియా పేర్కొన్నారు.
ఈ విధంగా పొదుపు చేయాలి...
* షవర్ ద్వారా స్నానం చేయడాన్ని మానేసి బకెట్లు, మగ్గులను ఉపయోగించాలి
* కార్లను కూడా నీటితో కడగకుండా పొడి గుడ్డతో తుడవాలి
* పళ్లని బ్రష్ చేసే సమయంలో అదేవిధంగా షే వింగ్ చేసేప్పుడు ట్యాప్‌ను ఆన్ చేసి ఉంచవద్దు
* రన్నింగ్ వాటర్‌తో పాత్రలను శుభ్రపర్చరాదు. ఇందుకు నీరు ఎక్కువగా వినియోగమవుతుంది.
* ట్యాప్ ద్వారా నిరంతరం నీరు లీకేజ్ అయినట్లయితే వెంటనే మరమతులు చేయించాలి. మొక్కలకు
మంచినీటిని ఉపయోగించొద్దు
* డిష్ వాషర్లు, వాషింగ్ మిషన్లను సాధ్యమైనంత వరకు నిషేధించాలి
* సొసైటీ కంపౌండ్‌లో ఉన్న ఈత కొలనును నిషేధించాలి
* వాటర్ పైప్‌లైన్‌లో లీకేజీ ఉంటే వెంటనే హెల్ప్‌లైన్ నెం. 1916ను ఆశ్రయించాలి.