తల్లితో వరుణ్ బరన్వాల్
అతనో సైకిల్ షాపు యజమాని కొడుకు. అయితేనేం.. యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 32వ ర్యాంకు కొట్టాడు. అంటే.. పక్కాగా ఐఏఎస్కు ఎంపిక అయినట్లేనన్నమాట. మహారాష్ట్రలోని థానె జిల్లా బోయిసర్కు చెందిన వరుణ్ బరన్వాల్ ఈ ఘనత సాధించాడు. నిజానికి పదోతరగతి పరీక్షలు రాస్తున్నప్పుడే 2003లో వరుణ్ తండ్రి మరణించారు. అయినా ఆ పరీక్షల్లో 89 శాతం మార్కులు సాధించాడు.
పుణెలోని ఎంఐటీ కాలేజి నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్లో డిగ్రీ పూర్తి చేయడమే కాదు.. ఏకంగా గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. కాలేజీలో సీనియర్లు తనకు ఎంతగానో సహకరించారని, మహారాష్ట్ర, గుజరాత్ లేదా కర్ణాటక రాష్ట్రాలలో ఏదో ఒక కేడర్లో ఐఏఎస్ అధికారిగా చేరాలని అనుకుంటున్నానని వరుణ్ చెప్పాడు. ప్రస్తుతం తన తల్లితో కలిసి ఉంటున్న వరుణ్ తమ సైకిల్ షాపును కూడా చూసుకుంటున్నాడు.