తొలి భర్త, ప్రేయసిని కలిపిన కోర్టు
ముంబై: మతాంతర ప్రేమ వివాహం చేసుకున్న జంటను విడదీసి, యువతి బంధువులు బలవంతంగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి చేశారు. తొలి భర్త న్యాయ పోరాటం చేయడంతో.. కోర్టు జోక్యం చేసుకుని విడిపోయిన ఆ ప్రేమజంటను మళ్లీ ఒకటి చేసింది. సినిమా కథను తలపించే ఈ సంఘటన రాజస్థాన్లో జరిగింది.
రాజస్థాన్కు చెందిన ఓ ప్రేమజంట గత జూన్లో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి పారిపోయి వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత యువతి బంధువులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి గుజరాత్కు చెందిన మరో వ్యక్తితో పెళ్లిచేశారు. తన భార్య (గర్భవతి) తప్పిపోయిదంటూ మొదటి భర్త ముంబైకి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫలితం లేకపోవడంతో అతను బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. పోలీసుల సాయంతో తన భార్యను తనకు అప్పగించాలని కోర్టును కోరాడు. హైకోర్టు ఆదేశాల మేరకు రాజస్థాన్ పోలీసులు యువతి ఇంటికెళ్లి ఆమెను తీసుకువచ్చి ఈ నెల 23న కోర్టులో హాజరుపరిచారు. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తావా లేక భర్త దగ్గర ఉంటావా అన్ని న్యాయమూర్తులు ఆ యువతిని ప్రశ్నించగా.. తనను తొలుత వివాహం చేసుకున్న, ముంబైలో ఉంటున్న భర్త (ప్రియుడు) వద్ద ఉంటానని చెప్పింది. దీంతో ఈ ప్రేమజంట మళ్లీ కలసి జీవించేలా బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది.