మండపంలోనే వరుడిని ఛీకొట్టింది!
పాట్నా: మరికొన్ని క్షణాల్లో పెళ్లితంతు ముగుస్తుందని భావించిన అందరికీ వధువు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తాగుబోతు వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని, తాను ఈ వివాహం చేసుకోనని తేల్చి చెప్పడంతో కార్యక్రమం రద్దయింది. ఈ ఆశ్చర్యకర ఘటన బిహార్ లోని బక్సార్ జిల్లా సుజాత్‌పూర్‌లో గత శనివారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. బిట్టు పాండే(24)కు రాణి కుమారిని ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు భావించారు. శుక్రవారం రాత్రి వరకూ అన్ని పనులు పూర్తిచేశారు.
శనివారం ఉదయం పెళ్లితంతు దాదాపు పూర్తయింది. వధువు మెడలో మూడు ముళ్లు పడతాయనగా వరుడిని ఛీకొట్టింది. బిట్టును పెళ్లిచేసుకోనని, అతడు మద్యం సేవించి ఉన్నాడని.. అందుకే సరిగ్గా నిలబడలేకపోతున్నాడంటూ రాణి తన బంధువులకు వివరించింది. ఆమె పెద్దలు ఇందుకు సమ్మతించారు. జీలకర్ర పెట్టిన తర్వాత పెళ్లి ఆగిపోవడంతో పెళ్లికి వచ్చిన బంధువులు, సన్నిహితులు షాకయ్యారు.
పెళ్లిరద్దుపై వధువు రాణి కుమారి బంధువు జై నిశ్వాస్ స్పందించారు. 'బిహార్ లో గత ఏప్రిల్ 5 నుంచి పూర్తి మద్యనిషేధం అములులో ఉంది. ఎవరైనా మద్యం సేవించినట్లు అధికారులు గుర్తిస్తే దాదాపు పదేళ్లపాటు జైలుశిక్ష పడుతుందని వధువు ఇలా చేసింది. ముందుగానే వరుడి గురించి తెలిసినందుకు బంధువులు అందరూ సంతోషంగా ఉన్నారు' అని చెప్పుకొచ్చాడు. గత వారం తూర్పపట్నాలో వరుడు బైక్ డిమాండ్ చేయడంతో వధువు పెళ్లిని ఆపేసిన విషయం తెలిసిందే.