బ్రిడ్జి కూలి.. పిల్లలకు తీవ్రగాయాలు
Published Thu, Aug 17 2017 10:01 AM | Last Updated on Sat, Sep 15 2018 5:14 PM
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్‌లో పాదాచారుల వంతెన తెగిపడి ఘటనలో 22 మంది స్కూల్ పిల్లలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయాలైన 11 మందిలో ఒకరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, మిగతా వాళ్లు కోలుకున్నారని వైద్యులు వెల్లడించారు. మరోపక్క ఎవరో కావాలనే ఈ పని చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయటంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
లోవర్ దిబంగ్ వ్యాలీ జిల్లాలోని దెసలి అనే గ్రామంలో జముపనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బుధవారం పంద్రాగష్టు వేడుకల్లో పాల్గొన్నారు. తిరిగి వారు ఇంటికి వెళ్తున్న సమయంలో సమీపంలోని పాదాచారుల వంతెన దాటుతున్నారు. అంతలో ఓవైపు తాడు మొత్తంగా తెగిపడటంతో పిల్లలంతా కింద పడిపోయారు. కాలువలో నీళ్లు తక్కువగా చాలా మందికి రాళ్ల దెబ్బలు తగిలాయి. ఘటన మారుమూల పల్లెలో చోటుచేసుకోవటం, పైగా ప్రతికూల వాతావరణ ప్రభావంతో అధికారులు అక్కడికి చేరుకునేందుకు చాలా సమయమే పట్టింది.
చివరకు నావికా దళాన్ని రంగంలోకి దించి ఓ విమానం సాయంతో తీవ్రంగా గాయపడిన 11 మంది పిల్లలను జిల్లా కేంద్రంలోని ఆదిత్యా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి పెమ ఖండు తక్షణమే వారికి సాయం అందించాలని, ఘటనపై విచారణ చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
Advertisement
Advertisement