పాక్ కాల్పుల్లో గాయపడిన వ్యక్తిని జమ్మూ ఆస్పత్రికి తీసుకొస్తున్న దృశ్యం
• పాక్ కాల్పులను తిప్పికొడుతున్నాం: బీఎస్‌ఎఫ్
• సరిహద్దులో బీఎస్‌ఎఫ్ పోస్టులపై పాక్ కాల్పులు
• భారీ కాల్పులు, షెల్లింగ్‌లో ఇద్దరు భారత పౌరుల మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో భారత్-పాకిస్తాన్ సరిహద్దు వెంట షెల్లింగ్‌కు, కాల్పులకు తెగబడిన పాక్ సైనికులను తిప్పికొడుతూ వారం రోజులుగా తాము జరిపిన కాల్పుల్లో 15 మంది పాక్ రేంజర్లు చనిపోయారని బీఎస్‌ఎఫ్ శుక్రవారం తెలిపింది. పాక్ రేంజర్ల కాల్పుల్లో భారత్ వైపు జమ్మూ ప్రాంతంలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారని, మరో ఇద్దరు గాయపడ్డారని పేర్కొంది. జమ్మూ, కతువా, పూంచ్, రాజౌరి జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట పౌర నివాస ప్రాంతాలు, భద్రతా శిబిరాలు లక్ష్యంగా పాక్ పారామిలటరీ బలగాలు మోర్టార్ షెల్స్, ఆటోమాటిక్ తుపాకులతో కాల్పులు జరుపుతున్నాయని తెలిపింది.
కాగా, గురువారం సాయంత్రం కతువా సెక్టార్‌లో పాక్ రేంజర్లు ఎలాంటి కవ్వింపూ లేకుండా భారీ కాల్పులు, షెల్లింగ్‌ను ప్రారంభించారని.. అనంతరం అది హీరానగర్, సాంబా సెక్టార్లకు కూడా విస్తరించిందని వివబీఎస్‌ఎఫ్ తెలిపింది. 24 బీఎస్‌ఎఫ్ పోస్టుల ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 5:00 గంటల వరకూ ఈ కాల్పులు కొనసాగాయంది. ‘పాక్ షెల్లింగ్, కాల్పులను గట్టిగా తిప్పికొడుతున్నాం. మేం వారి ఔట్‌పోస్టులను ధ్వంసం చేశాం. సరిహద్దు వెంట పారామిలటరీ రేంజర్లకు పాక్ సైన్యం మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది’ అని బీఎస్‌ఎఫ్ అదనపు డెరైక్టర్ జనరల్ అరుణ్‌కుమార్ శుక్రవారం జమ్మూలో విలేకరులకు చెప్పారు. ఇదిలావుంటే.. పాక్ షెల్లింగ్‌లో పల్లన్‌వాలా సెక్టార్‌లోని ఖోర్ బెల్ట్‌లో శుక్రవారం ఒక పౌరుడు చనిపోగా, మరొక పౌరుడు గాయపడ్డాడు.
పూంచ్ జిల్లా మెంధర్ తాలూకా గోహ్లాద్ గ్రామంలో ఉస్మాబీ అనే 50 ఏళ్ల మహిళ పాక్ షెల్లింగ్‌లో చనిపోగా మరొక పౌరుడు గాయపడ్డాడు. శుక్రవారం కొన్ని గంటల విరామం తర్వాత పాక్ రేంజర్లు ఆర్.ఎస్.పురా సెక్టార్‌లోని అబ్దుల్లియాన్ బెల్ట్‌లో మళ్లీ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డారు. రాజౌరి, జమ్మూ జిల్లాల్లోని నౌషెరా, సుందర్బానీ, పల్లన్‌వాలా సెక్టార్లలో పాక్ సైన్యం ఎటువంటి కవ్వింపూ లేకుండానే కాల్పులకు తెగబడింది. పాక్ సైన్యం చిన్న తుపాకులు, ఆటోమేటిక్ తుపాకులు, 82 ఎంఎం మోర్టార్లు, 120 ఎంఎం మోర్టార్లను ఉపయోగించిందని తెలిపారు. ఎల్‌ఓసీ వెంట బాలాకోట్, మాన్‌కోట్ సెక్టార్లలో కూడా కాల్పులు జరుగుతున్నాయని, ఇద్దరు భద్రతా సిబ్బంది గాయప్డడారని వార్తలు వచ్చాయి.
మా సైనికులెవరూ చనిపోలేదు: పాక్
ఇస్లామాబాద్: సరిహద్దు వెంట బీఎస్‌ఎఫ్ కాల్పుల్లో తమ సైనికులు ఎవరూ చనిపోలేదని పాక్ సైన్యం పేర్కొంది. భారత దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని.. పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లోని భారత డిప్యూటీ హైకమిషనర్ జె.పి.సింగ్‌ను పిలిపించి నిరసన తెలిపింది. గురువారం షాకార్‌గఢ్‌లో భారత బలగాల కాల్పుల వల్ల ఆరుగురు పౌరులు చనిపోయారని పేర్కొంది.
ప్రభుత్వానికి సైన్యం జవాబుదారీ: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సాయుధ బలగాలు ప్రభుత్వానికి బాధ్యత వహించాలని, లేదంటే దేశంలో సైనిక చట్టం అమలవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. పీఓకేలో భారత ఆర్మీ చేసిన సర్జికల్ దాడులతో రక్షణమంత్రి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని.. అలా చేయకుండా ఆయనను నిరోధించాలని ఎం.ఎల్.శర్మ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. సైన్యం ప్రభుత్వానికి జవాబుదారి అని.. ఇందులో వ్యక్తిగత ప్రయోజనమేముందని ప్రశ్నించింది.
భారత జవాను మృతి మృతదేహాన్ని ముక్కలుగా నరికిన మిలిటెంట్లు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్‌లో శుక్రవారం చొరబాట్లకు యత్నించిన మిలిటెంట్లను భారత జవాన్లు అడ్డుకున్నారు. ఎదురుకాల్పుల్లో ఓ మిలిటెంట్ హతమవగా.. ఓ జవాను అమరుడయ్యాడు. పారిపోయే ముందు మిలిటెంట్లు.. అమరుడైన జవాను మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించారు.