పఠాన్ కోట్ వద్ద పాక్ బోటు స్వాధీనం
పఠాన్కోట్: బెలూన్లు, పావురాలు, బోట్లు ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి భారత్ భూభాగంలోకి, భారత జలాల్లోకి అడుగుపెడుతూ గుబులు రేపుతున్న అంశాలివి. మొన్నటికి మొన్న గుజరాత్ తీరంలోకి దూసుకొచ్చి ఆందోళన సృష్టించిన పాక్ కు చెందిన బోటు ఘటన మరువకముందే మళ్లీ అలాంటి ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈసారి మాత్రం పఠాన్ కోట్ ప్రాంతంలో.. అది కూడా ఖాళీ బోటు. పటాన్ కోట్ సెక్టార్ లో రావినది ప్రవాహానికి కొట్టుకొచ్చిన పాక్ కు చెందిన ఓ ఖాళీ బోటును అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
అయితే, ఈ బోటులో ఏమీ లేదని, ఖాళీదని బలగాలు చెప్పాయి. నదిలో ప్రవాహం పెరిగిన కారణంగా ఈ బోటు కొట్టుకొచ్చి ఉండొచ్చని చెబుతున్నారు. ఈ నెల(అక్టోబర్ 2)న జాతీయ తీర ప్రాంత గస్తీ దళం గుజరాత్ తీరంలో ఓ బోటును అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో తొమ్మిదిమందిని కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే, వారు మత్య్సకారులని గుర్తించారు. పాక్ ఉగ్రవాదులపై భారత సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించిన తర్వాత ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్న విషయం తెలిసిందే.