జియోను తలదన్నేలా బీఎస్ఎన్ఎల్
న్యూఢిల్లీ: టెలికం సంస్థల మధ్య కాంపిటేషన్ వార్ మొదలైంది. బీఎస్ఎన్ఎల్ ఈ వార్ను డిక్లేర్ చేసింది. జియోకు తానేమి తక్కువ కాదంటూ దూసుకొస్తోంది. కొత్త ఏడాది నుంచి తాము కూడా ఉచిత వాయిస్ కాల్స్ అందించడమే కాకుండా తక్కువ టారిఫ్ లతో వినియోగదారులకు సేవలందిస్తామంటూ బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఉచిత వాయిస్ కాల్స్ , తక్కువ ధరకే ఇంటర్నెట్ ప్యాకేజ్ లు అంటూ మొబైల్ రంగంలోకి దూసుకొచ్చి ఇతర టెలికం సంస్థలకు అనూహ్యంగా రిలయన్స్ జియో షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు అన్ని నెట్ వర్క్ లపై ప్రభావం పడింది.
తమ వద్ద ఉన్న కస్టమర్లను జియోవైపు వెళ్లనీయకుండా ఆయా సంస్థలు తీవ్రతంటాలు పడుతున్నాయి. ఆఫర్లను మార్చుకుంటున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం జియోకు ధీటుగా వస్తున్నానంటూ ప్రకటించేసింది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉచిత వాయిస్ కాల్స్ ఇచ్చేందుకు ముందుకొస్తోంది. దీంతో జియో ఆగమనం తర్వాత దానికి పోటీగా దూసుకొస్తున్న మరో టెలికం సంస్థగా బీఎస్ఎన్ఎల్ మారనుంది. అంతేకాదు జియో కేవలం 4జీ ఫోన్లకు మాత్రమే ఉచిత వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని అందిస్తుండగా బీఎస్ఎన్ఎల్ మాత్రం 2జీ, 3 జీ ఫోన్లకు ఈ సౌకర్యం అందించనుందట.
'మేం ప్రస్తుత మార్కెట్లో జియో పనితీరును పూర్తిగా పరిశీలన చేస్తున్నాం. మేం కూడా వచ్చే కొత్త ఏడాది నుంచి అత్తి తక్కువ టారిఫ్ లు కొత్త కొత్త ఆఫర్లతోపాటు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఫ్రీ వాయిస్ కాల్స్ ఇస్తాం' అని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ చెప్పారు. 'జియోకంటే తక్కువ రేట్ కే ఈ ప్లాన్ అందించనున్నాం. ఇది కేవలం రూ.2 నుంచి రూ.4 ఉండొచ్చు' అని ఆయన చెప్పారు. కేరళ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిషా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లలో బీఎస్ఎన్ఎల్కు అతి పెద్ద మార్కెట్ ఉంది.
ఈ ప్రాంతాల్లో జనవరి నుంచి తొలుత జీరో వాయిస్ టారిఫ్ ప్లాన్స్ అందించనున్నట్లు ఈ ప్లాన్ లోకి ప్రవేశించేందుకు కూడా అతితక్కువ మొత్తంలోనే రుసుము వసూలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం జియో ప్లాన్ లోకి ప్రవేశించాలంటే రూ.149 చెల్లించాలి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం ప్రవేశ రుసుం రూ.2 నుంచి రూ.4మాత్రమే వసూలు చేస్తుందట. బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదార్లతోపాటు ఇంటి వద్ద బ్రాడ్ బ్యాండ్ సేవలు ఉపయోగించుకుంటున్నవారికి కూడా ఈ ప్లాన్ అందిస్తామని శ్రీవాత్సవ చెప్పారు. బీఎస్ఎన్ఎల్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఇక ఎయిర్ టెల్ ప్లస్, వోడాఫోన్, ఐడీయాలపై మరింత ప్రభావం పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.