ఉత్తరప్రదేశ్‌లో మరో కొత్త పార్టీ రానుందా? మాయావతి వ్యతిరేకులు, కాన్షీరాం కుటుంబీకులు కలసి నూతన పార్టీని
మాయావతి వ్యతిరేకులతో కలసి ఏర్పాటుకు కాన్షీరాం సోదరుడి యత్నాలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో కొత్త పార్టీ రానుందా? మాయావతి వ్యతిరేకులు, కాన్షీరాం కుటుంబీకులు కలసి నూతన పార్టీని స్థాపించనున్నారా? 2017 అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఇది నిజం కావొచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాన్షీరాం చిన్న సోదరుడు దల్బారా సింగ్ ఇందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన కొద్ది ఏళ్లుగా బహుజన సంఘర్ష్ పార్టీ(కాన్షీరాం)కి నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం మాయావతికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తున్నారు. మాయావతి యూపీ సీఎంగా ఉన్నప్పుడు బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన నేతలు దల్బారా వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు.
‘కాన్షీరాం సిద్ధాంతాల నుంచి మాయావతి ఎలా దూరం జరిగారో ప్రజలకు వివరిస్తున్నా. బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన వారు కూడా నాతో జత కలుస్తున్నారు. అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోందన్న వాస్తవాలను ప్రజల ముందుంచుతాం. మాయావతి పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. తగిన ప్రత్యామ్నాయంగా ఎదిగితే మా నాయకత్వాన్ని బలపరిచేందుకు జనం సిద్ధంగా ఉన్నారు’ అని దల్బారా సింగ్ తెలిపారు. 2017కల్లా మాయావతికి ప్రత్యామ్నాయంగా ఎదిగి యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడాలన్నదే తమ లక్ష్యమన్నారు. కాన్షీరాం ఆశయాలతో జనాన్ని ప్రభావితం చేస్తూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తమ ఉనికిని చాటుకుంటామని చెప్పారు. కాన్షీరాం సిద్ధాంతాలను అనుసరించేవారు, బీఎస్పీ నుంచి బయటకు వచ్చినవారు తమతో కలిసి వస్తారన్నారు. బీఎస్పీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన దద్దూ ప్రసాద్ ఇటీవలే సామాజిక్ పరివర్తన్ మంచ్ పేరుతో కొత్త పార్టీ నెలకొల్పారు. ఈయన కూడా దల్బారాకు మద్దతు పలికే అవకాశాలున్నాయి.