బుల్లెట్ ట్రైన్‌తో దూసుకెళ్తాం: మోదీ
బుల్లెట్ ట్రైన్‌తో దూసుకెళ్తాం: మోదీ
Published Thu, Sep 14 2017 3:46 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM
సాక్షి, అహ్మదాబాద్: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుతో దేశ ఆర్థిక వృద్ధి పరుగులు పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాలు, ప్రజల మధ్య దూరం తగ్గడంతో హైస్పీడ్ కనెక్టివిటీ ఫలితంగా ఉత్పాదకత పెరుగుతుందని అన్నారు. ముంబయి, అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ పనులను ప్రారంభించిన అనంతరం ఈ ప్రాజెక్టుతో మేక్ ఇన్ ఇండియా ఆశయాలు మున్ముందుకు సాగుతాయని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే పేర్కొన్నారు.
భారత్, జపాన్‌ల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఇరువురు నేతలు అన్నారు. అహ్మదాబాద్‌లో శంకుస్ధాపన కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో నవభారత్ ఆవిష్కరణకు ఉత్తేజం లభిస్తుందని, మన స్వప్నాలు ఫలించేలా దేశం సగర్వంగా ముందుకు సాగేందుకు బాటలు పడతాయని అన్నారు.
ఈ భారీ ప్రాజెక్టులో ఎలాంటి జాప్యం, అవరోధాలు లేకుండా ముందుకెళ్లేందుకు జపాన్ ప్రధాని అబే ప్రత్యేక చొరవ తీసుకున్నారని ప్రశంసించారు. బుల్లెట్ ట్రైన్ కోసం జపాన్ కేవలం 0.1 శాతం వడ్డీతో రూ 80,000 కోట్ల రుణం మంజూరు చేసిందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన టెక్నాలజీ జపాన్ అందిస్తుండగా, పరికరాలు, తయారీ పూర్తిగా భారత్‌లోనే జరుగుతుందని అన్నారు. రూ 1.10 లక్షల కోట్లతో చేపట్టే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 2022 నాటికి పూర్తవుతుంది. ముంబయి, అహ్మదాబాద్‌ల మధ్య 500 కిమీ దూరాన్ని కేవలం రెండు గంటల్లోనే బుల్లెట్ ట్రైన్ చేరుకుంటుంది. ఈ ప్రాజెక్టును భారత రైల్వేలు, జపాన్‌కు చెందిన షిన్‌కన్సెన్ టెక్నాలజీలు సంయుక‍్తంగా చేపడతాయి.
Advertisement
Advertisement