తమిళనాడు రాజకీయ తెరపై మరో సినీకెరటం ఎగిసిపడనుందా? హీరో విజయ్ తెరంగేట్రం నుంచి రాజకీయ అరంగేట్రం చేయాలని ఒత్తిళ్లు పెరుగుతున్నాయా?.. అవుననే అంటోంది తమిళనాడు ప్రజానీకం. సంచలనాత్మక విజయం సాధించిన మెర్శల్ చిత్రం పుణ్యమాని విజయ్‌కు ఇంటినుంచే రాజకీయ వాసనలు మొదలయ్యాయి. విజయ్ రాజకీయాల్లోకి రావాలి, రాష్ట్రంలో మార్పు తేవాలి అంటూ సాక్షాత్తు ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ తన అభిప్రాయాన్ని మంగళవారం బహిరంగంగా ప్రకటించేశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: మెర్శల్ చిత్ర వివాదం నేపథ్యంలో మరో కోణం వెలుగుచూసింది. తమిళనాట మార్పు కోసం హీరో విజయ్ రాజకీయాల్లో రావాలని ఆశిస్తున్న ఆయన తండ్రే ఓ ఇంటర్వూ్యలో అభిప్రాయపడ్డారు. తమిళనాడులో రాజకీయాలు, సినిపరిశ్రమను వేరువేరుగా చూడలేం. ఆనాటి ముఖ్యమంత్రి అన్నాదురై మొదలుకుని కరుణానిధి, ఎంజీ రామచంద్రన్ ఇటీవల మరణించిన జయలలిత వరకు అందరూ సినీ నేపథ్యం ఉన్నవారే. సినిమాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారికి రాజకీయాల్లోకి వెళ్లడం అంటే రెడ్‌కార్పెట్ స్వాగతంలా భావిస్తారు. ఎంజీఆర్ తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై రెండు దశాబ్దాలుగా రాజకీయ ఒత్తిడి ఉంది. విముఖత ప్రదర్శిస్తూ వచ్చిన రజనీ ఇటీవల చూచాయగా తన రాజకీయ ఆసక్తిని చాటుకున్నారు. పార్టీ పెట్టడం ఖాయమనే పరిస్థితులు కల్పించిన రజనీకాంత్ ఈ ఏడాది డిసెంబరు 12వ తేదీన తన పుట్టిన రోజున పార్టీని ప్రకటిస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. రాజకీయాలకు దూరంగా మెలిగే కమల్‌హాసన్‌లో జయలలిత మరణం మార్పు తెచ్చింది. రాష్ట్రంలోని ప్రతి చిన్న అంశానికి స్పందించడం, అధికార అన్నాడీఎంకేను దుయ్యబట్టడం ద్వారా రాజకీయాల్లోకి రావడం ఖాయమని చాటారు. అయితే కమల్, రజనీ స్పష్టమైన ప్రకటన చేయకుండా రాజకీయ ప్రవేశాన్ని నాన్చుతూ వస్తున్నారు.
మద్దతుల వెల్లువ
రజనీకాంత్, కమల్‌హాసన్, నిర్మాత మండలి అధ్యక్షులు, నటులు విశాల్‌తోపాటూ తమిళ సినీపరిశ్రమ మద్దతుగా నిలవడంతో మెర్శల్ నిర్మాతలు కొన్ని సన్నివేశాలను తొలగించాలనే ఆలోచనను విరమించుకున్నారు. సినిమాల్లో ప్రజాసమస్యలను ప్రస్తావించడం భావప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది కాబట్టి ఫలానా సన్నివేశాలను తొలగించాలని కోరడం సమజసం కాదని అన్నారు. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ పొందిన తరువాత విడుదలైన చిత్రంపై పరిశీలనలు చేయడం సినిమా పరిశ్రమకే ముప్పు అని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సినిమాలో చోటుచేసుకున్న సన్నివేశాలు వాస్తవమైనవి, వీటిని రాజకీయ పార్టీలు విమర్శించరాదని అభిమానులు పేర్కొంటున్నారు.
విజయ్‌కు రాజకీయ రంగు
కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ సహా పలు రాజకీయ పార్టీల నేతలు మెర్సల్ సినిమాలోని డైలాగులకు హర్షం వెలిబుచ్చడంతో విజయ్‌కు రాజకీయరంగు అంటుకుంది. రాబోయే కాలంలో రాష్ట్రాన్ని పాలించగల సత్తా ఉన్న నేత విజయ్ అంటూ అభిమానులు చేస్తున్న ప్రచారానికి ప్రజల్లో మద్దతు లభిస్తోంది. అంతేగాక, కమల్, రజనీలకు పోటీగా విజయ్ రాజకీయాల్లోకి రావాలనే కోరికను కొందరు వెలిబుచ్చుతున్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో మెర్శల్ చిత్రం ద్వారా విజయ్ తొలి అడుగు వేశాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
విజయ్ రాకతో మార్పు : తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్
రాష్ట్రంలో మార్పుకోసం తన కుమారుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని నటుడు విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకులు ఎస్‌ఏ చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మెర్శల్ వివాదం నేప«థ్యంలో చంద్రశేఖర్ ప్రముఖ తమిళ టీవీ చానల్ పుదియతలైమురైకి ఇచ్చిన ఇంటర్వూ్య మంగళవారం సాయంత్రం ప్రసారమైంది. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘‘సినిమాల్లో మంచి సందేశం ఇచ్చినపుడు రాజకీయ నేతలు ఆదరిస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలు పదేపదే చోటుచేసుకుంటే వారిలో రాజకీయ ప్రవేశ ఆలోచనలు రావడం సహజం. ఈ సత్యాన్ని తెలుసుకోకుండానే నేతలు, కార్యకర్తలు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. ఆ తరువాత అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు పోరాడుతున్నవారే రేపటి నాయకులు, ఈ పరిస్థితుల్లో తమ జీవితం గురించి ఆలోచించకూడదు. తన కోసం ఆలోచించేవాడు కాక సమాజం కోసం ఆలోచించే నాయకుడని ప్రజలే తయారు చేసుకోవాలి.
ఇలాంటి నాయకులు వచ్చినపుడు వారి వెంట నడిచేందుకు నేను సిద్ధంగా ఉంటాను. ఎంజీ రామచంద్రన్‌ను ఎవరూ సినీనటుడిగా చూడలేదు. ఆయన స్థానంలో మరెవరినీ పోల్చిచూడలేం. ప్రజల్లో ఆయన ఆ స్థాయిలో నమ్మకం పెంచుకున్నారు. నేటి రాజకీయ నాయకులు రేపు ప్రభుత్వంలో ఉండవచ్చు, ఈరోజు బెదిరింపులకు గురవుతున్న నటుడు (విజయ్) రేపు అధికారంలోకి రావచ్చు. విజయ్ తనలోని కోపాన్ని వెలిబుచ్చేందుకే మెర్శల్ చిత్రంలో నటించాడు. విజయ్ ఒక గాంధేయవాది. గత మూడేళ్లకు పైగా అతను రాజకీయాలు మాట్లాడటం లేదు. అతను ఒక రాజకీయనేతగా మారి తనను నమ్ముకున్న వారికి ఒక మార్పును తీసుకురావాలి. విజయ్ రాజకీయాల్లోకి రావాలని నా వ్యక్తిగత అభిప్రాయం. రాజకీయ ప్రవేశంపై విజయ్ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment