సాక్షి, చెన్నై : దళపతి విజయ్ పేరు, ఫొటో వ్యవహారంలో తనపై కేసులు పెట్టి జైల్లో పెట్టిచ్చినా పర్వాలేదు అని ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. విజయ్ మంచి కోసమే తాను రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యానని పేర్కొన్నారు. సినీ నటుడు విజయ్ పేరిట ఆయన తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ గుర్తింపుకోసం దరఖాస్తు వెల్లడం చర్చకు దారి తీసింది. ఇది పూర్తిగా తన వ్యక్తిగతం అని ఎస్‌ఏ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ పార్టీకి తనకు సంబంధం లేదని, తన ఫొటో, పేరును వాడుకుంటే చట్టపరంగా చర్యలు తప్పవని విజయ్ హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో శనివారం ఓ ఛానల్‌కు ఎస్‌ఏ చంద్రశేఖర్ ఇంటర్వూ్య ఇచ్చారు. (నాన్న పార్టీ.. నాకు సంబంధం లేదు: విజయ్)
ఉన్నత స్థానంలో ఉండాలన్నదే..
తన కుమారుడు విజయ్ ఉన్నత స్థానంలో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని ఎస్‌ఏ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. అందుకే 1993లో విజయ్ అభిమాన సంఘాన్ని తాను ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. ఇప్పుడు విజయ్ పెద్ద స్టార్ అయినంత మాత్రాన తన కుమారుడు కాదా అని ప్రశ్నించారు. తన బిడ్డకు ఏమి చేస్తే మంచిదో అని ఓ తండ్రిగా ఆలోచించానని, తన రాజకీయ పార్టీ అంటే విజయ్ ఇప్పుడు ఇష్టం లేకుండా ఉండ వచ్చు అని, అయితే, దీని రూపంలో భవిష్యత్తులో ఆయనకు మంచి జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీ గురించి విజయ్‌ను తాను సంప్రదించలేదని, ఏర్పాటు తదుపరి కొంత కాలానికి అర్థం చేసుకుంటాడని భావించినట్టు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
తన పార్టీలోకి చేర వద్దు అని అభిమానులకు సూచించారని, వేచి చూద్దాం.. విజయ్ అర్థం చేసుకునే సమయం వస్తుందని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఫొటో, పేరు వాడుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని విజయ్ హెచ్చరించారని, అలాగే, చర్యలు తీసుకోనివ్వండి, కేసు పెట్టి జైల్లో పెట్టించినా పర్వాలేదు అని చివరి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తండ్రిపై చర్యలు తీసుకున్న తనయుడు అని ఇది కూడా ఓ చరిత్ర అవుతుందని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment