తమిళసినిమా: కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్. చట్టం ఒరు ఇరుట్టరై చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన ఈయన చిత్రాలన్నీ అవినీతి, అక్రమాలపై పోరాడేవిగానే ఉంటాయి. రాజకీయ సెటైర్లు ఎక్కువగానే ఉంటాయి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో 70 చిత్రాలు చేసిన 40 ఏళ్ల నాన్‌స్టాప్ సినీ ప్రస్థానం ఎస్ ఏ.చంద్రశేఖర్ ది. ఈయన తాజాగా స్వీయ దర్శకత్వంలో నిర్మించి కీలక పాత్రలో నటించిన చిత్రం నాన్ కడవుల్ ఇల్‌లై. దర్శకుడు సముద్రఖని కథానాయకుడిగా నటించిన ఇందులో నటి ఇనియా, సాక్షి అగర్వాల్, శరవణన్ ముఖ్యపాత్రలు పోషించారు.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఒక పోలీస్ అధికారికి కరుడుకట్టిన రౌడీకి మధ్య పోరే ఈ చిత్ర కథ. ఇందులో సాక్షి అగర్వాల్ యాక్షన్ హీరోయిన్‌గా అవతారం ఎత్తారు. దర్శకుడు చంద్రశేఖర్ మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో తన కుమారుడు విజయ్‌ను డాక్టర్ కావాలని ఆశించానని అయితే తను మాత్రం యాక్టర్ కావాలని కోరారు అన్నారు. దీంతో విజయ్‌ను హీరోగా పరిచయం చేసి, తన స్వీయ దర్శకతంలో చిత్రం చేసి ఒక తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించానన్నారు.
ఆ తర్వాత విజయ్ తన ప్రతిభతో దళపతిగా అభిమానుల గుండెల్లో నిలిచే స్థాయికి చేరుకున్నారని చెప్పారు. ఈరోజు అభిమాన సంఘం చాలా అవసరం అన్నారు. దీంతో తానే తొలి అభిమానిగా విజయ్ అభిమాన సంఘాన్ని ప్రారంభించానని, అది ఇప్పుడు విజయ్ మక్కల్ ఇరుక్కంగా మారిందని చెప్పారు. ఇకపోతే తాను జీవించినంతవరకు సక్సెస్‌ఫుల్ కళాకారుడిగానే కొనసాగాలని భావిస్తున్నారన్నారు. అందులో భాగమే ఇప్పుడు చేసిన నాన్ కడవుల్ ఇల్‌లై చిత్రం అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment