సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రైళ్లు ఆలస్యంగా నడవడంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రైల్వే శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంటుకు ఇచ్చిన నివేదికలో ఈ మేరకు రైల్వే శాఖను ఉతికి ఆరేసింది. ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించడం, స్టేషన్లను అభివృద్ధి చేయడంపై రైల్వే శాఖ దృష్టి సారిస్తోంది తప్ప రైళ్ల రాకపోకలను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 15 రైల్వే స్టేషన్లను ప్రామాణికంగా తీసుకున్న కాగ్ నివేదికను రూపొందించింది.
ఆయా స్టేషన్లలో రైళ్ల రాకపోకలు భారీగా పెరిగిపోయాయని చెప్పిన కాగ్, ఆ స్థాయిలో ప్లాట్ ఫాంలు, వాషింగ్ పిట్‌లను అందుబాటులో ఉంచలేదని ఫైర్ అయింది. ఆ 15 స్టేషన్లలో మార్చి 2017 నాటికి 2,436 రైళ్లు నడుస్తున్నాయని, అందులో 638 రైళ్లు 24 అంతకంటే ఎక్కువ కోచ్‌లతో నడుస్తున్నాయని తెలిపింది. అయితే, ఆ స్థాయిలో ప్లాట్ ఫాంలు మాత్రం లేవని చెప్పింది. ప్లాట్ ఫాంల కొరత కారణంగానే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని తేల్చి చెప్పింది.
ముందు స్టేషన్లలో ప్లాట్ ఫాంలు ఖాళీ అయ్యేంత వరకూ ఔటర్ సిగ్నల్స్ వద్ద రైళ్లను ఆపేస్తున్నారని కాగ్ స్పష్టం చేసింది. అన్ని రైల్వే జోన్లు స్టేషన్ల అభివృద్ధికి ఓ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment