మనదేశంలో వస్తు సేవా పన్ను (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్– జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చి నేటికి (జూలై 1) సరిగ్గా ఏడాది పూర్తయింది. గతంలోని సంక్షిష్ట పన్ను విధానం నుంచి ఏకరూప పన్నుల విధానం అమలు వల్ల వివిధ వస్తువుల ధరలు కొంత మేర తగ్గాయి. అయితే పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీలో చేర్చాలనే డిమాండ్ మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది. రోజువారీ ప్రాతిపదికన వీటి ధరలు పెరుగుతుండటంతో పాటు వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పన్నులు విధిస్తుండటంతో పెట్రోఉత్పత్తుల ధరలు తడిసి మోపెడవుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా పడుతుండటంతో కనీసం ఈ ఏడాదైనా వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరల నియంత్రణకు అందుబాటులో ఉన్న పరిష్కారాలేమిటీ ? వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు ఉన్న అవకాశాలు, అడ్డంకులు ఏమిటన్నది చర్చకు వస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరు
- ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రోల్,డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకం, వ్యాట్ రూపంలో వేస్తున్న పన్నులే ప్రధాన ఆదాయ వనరులు. వివిధ రాష్ట్రాలు పెట్రోల్‌పై 15 నుంచి 40 శాతం మధ్యలో, డీజిల్‌పై 10 నుంచి 28.5 శాతం మధ్యలో పన్నులు విధిస్తున్నాయి. మొత్తంగా 50 శాతం వరకు పన్నులు అధికంగా పడుతున్నాయి. ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారాలు సిద్ధం చేస్తున్నట్టు కేంద్రం చెబుతున్న నేపథ్యంలో బహిరంగ చర్చల్లో కనీసం మూడు పరిష్కారాలు ఎక్కువగా వినపడుతున్నాయి.
- స్వల్పకాలిక పరిష్కారంలో భాగంగా పెరిగిన ధరలను ఓఎన్‌జీసీ సంస్థ భరించేలా చూడాలి (గతంలో ఇది అమలైంది). అయితే దీనివల్ల ఈ సంస్థ ఆర్థికవనరులు తగ్గిపోయి మరిన్ని సహజవాయు, చమురు నిక్షేపాలు వెలికితీసే కార్యక్రమాలు కుంటుపడతాయి. దాంతో ముడిచము రు దిగుమతిపై ఆధారపడటం పెరుగుతుంది.
- పెట్రోల్, డీజిల్ ధరల నిర్థారణను ఇంపోర్ట్ ప్యారిటీ ప్రైసింగ్ (ఐపీపీ) పద్ధతి నుంచి కాస్ట్ ప్లస్ ప్రైసింగ్ (సీపీపీ) పద్ధతికి మార్చాలని కొందరు సూచిస్తున్నారు.అంటే దిగుమతి చేసుకునే చమురు ధరల ఆధారంగా ధర నిర్ణయం(ఐపీపీ) నుంచి వినియోగదారుడికి చేర్చడానికి అయ్యే మొత్తం ఖర్చు ఆధారంగా నిర్ణయించే (సీపీపీ) స్థితికి మార్చాలని ప్రతిపాదన. దీనివల్ల చమురు శుద్ధి, ఉత్పత్తి జరిగే సముద్ర, నదీతీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న రాష్ట్రాలకు లాభం, మిగతా రాష్ట్రాలపై భారం పడుతుంది. అందువల్ల ఇది సాధ్యం కాకపోవచ్చు.
- పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తేవడా న్ని మరో పరిష్కారంగా చూపుతున్నారు. జీఎస్టీ లో భాగంగా గరిష్టంగా కేంద్రం 28% పన్ను విధించవచ్చు, దీంతో పాటు సెస్సు కూడా వేయవచ్చు (ఇందులో 14% రాష్ట్రాలకు వాటా వస్తుంది). ఈ కారణంగా రాష్ట్రాలకు వచ్చే ఆదాయం భారీగా తగ్గుతుంది. ఈ మేరకు తగ్గే ఆదాయాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. దీంతో పెట్రోధరలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయంలో అన్ని రాష్ట్రాలను ఏకాభిప్రాయానికి తీసుకురావడం అంత సులభమేమీ కాదు. వీటిపై జీఎస్టీ విధిస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే ధర అమల్లోకి రావడం వల్ల ఆయా రాష్ట్రాల అమ్మకపు పన్నులు తగ్గి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది.
ఈ కారణంగానే వీటిపై వినియోగదారులు అధిక సొమ్ము చెల్లించాల్సి వస్తో్తంది. పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ విధించి, దాని పన్నుల శ్లాబ్‌లో గరిష్టంగా ఉన్న 28 శాతం పన్ను, 15 శాతం సెస్సు విధించినా కూడా వీటి ధరలు తగ్గుతాయని జీఎస్టీ డీజీఎం విశాల్ రహేజా చెబుతున్నారు. రాష్ట్రాలతో ఏకాభిప్రాయం సాధించాక పెట్రో ఉత్ప త్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు. అయితే నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ మాత్రం ఇది ఆచరణ సాధ్యం కాదంటున్నారు.
జీఎస్టీలోకి పెట్రోల్‌ను చేర్చలేరా?
Published Sun, Jul 1 2018 2:37 AM | Last Updated on Sun, Jul 1 2018 8:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment