పై-లీన్ తుపానుపై అప్రమత్తంగా ఉండడంతో భారీ స్థాయిలో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. తుపాను స్థితిగతులపై కచ్చితమైన అంచనా, ప్రజలను త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, భారీస్థాయిలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో నష్టాన్ని వీలైనంత మేర తగ్గించగలిగినట్లు చెప్పారు
న్యూఢిల్లీ: పై-లీన్ తుపానుపై అప్రమత్తంగా ఉండడంతో భారీ స్థాయిలో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. తుపాను స్థితిగతులపై కచ్చితమైన అంచనా, ప్రజలను త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, భారీస్థాయిలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో నష్టాన్ని వీలైనంత మేర తగ్గించగలిగినట్లు చెప్పారు. విపత్తును ఎదుర్కోడానికి తాము ప్రణాళికాబద్ధంగా చేసిన ప్రయత్నాలు ఫలించాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి ఆదివారం పీటీఐతో అన్నారు.
ముప్పును సరిగ్గా అంచనా వేసిన వాతావరణ విభాగం, సహాయ కార్యక్రమాలను సమన్వయం చేసిన కేంద్ర హోం శాఖ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భువనేశ్వర్‌లోని డాప్లర్ రాడార్ల సాయంతో పై-లీన్ తీవ్రతను, గమనాన్ని కచ్చింతగా అంచనా వేయగలిగామని భారత వాతావరణ విభాగం డెరైక్టర్ జనరల్ ఎల్‌ఎస్ రాథోడ్ చెప్పారు.