ప్రచండ పవనాల ముప్పు ముగిసింది: ఐఎండీ
న్యూఢిల్లీ: ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రచండ పవనాల ముప్పు ఇక తప్పినట్టే. పై-లీన్ తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో విజృంభించిన గాలులు బీభత్సం సృష్టించాయి. దాదాపు గంటకు 220-240 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన పెనుగాలుల ధాటికి సముద్రతీర ప్రాంతాలు చిగురుటాకులా వణికాయి. ప్రభుత్వం యంత్రాంగం చురుగ్గా స్పందించడంతో ప్రాణనష్టం లేనప్పటికీ ఆస్తినష్టం ఎక్కువగానే జరిగింది.
తీరప్రాంత వాసులకు పెనుగాలుల ముప్పు ఇక లేనట్టేనని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తాజాగా వెల్లడించింది. అయితే 48 గంటల్లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సహా బీహార్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎల్ఎస్ రాథోడ్ తెలిపారు. వచ్చే 12 గంటల్లో ఒడిశాలో గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందన్నారు.
ఒడిశాలోని సంబల్పూర్కు 50 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైవుందన్నారు. దీని ప్రభావంతో ఒడిశా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని బీహార్కు సూచించామని రాథోడ్ చెప్పారు. పై-లీన్ తుఫాన్ నేపాల్ వైపు మళ్లే అవకాశముందన్నారు.