
'పోర్న్' సూత్రధారి అరెస్టు
అతను ఉన్నత కుటుంబంలో పుట్టాడు. పేరు కౌశిక్ కునార్. జల్సాలు, విదేశాల్లో చదువులకు కావాల్సినంత డబ్బుంది. ప్రఖ్యాత కాలేజీ నుంచి సాధించిన డిగ్రీ కూడా ఉంది. కానీ బుద్ధి మాత్రం వంకర దారి పట్టింది. దేశంలోనే అతిపెద్దదిగా భావిస్తోన్న 'పోర్న్' వీడియో స్కాండల్లో ప్రధాన నిందితుడైన అతడిని గురువారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అశ్లీల వీడియోలను భారీ ఎత్తున ఇంటర్నెట్లోకి అప్లోడ్ చేస్తూ.. పెద్దమొత్తంలో సొమ్ము చేసుకున్నాడని, అరెస్టు సమయంలో అతడి వద్ద దొరికిన వస్తువుల్పి చూసి నివ్వెరపోయామని సీబీఐ అధికారులు పేర్కొన్నారు.
'అశ్లీల వీడియోల్ని చిత్రీకరించేందుకు స్టెల్త్ కెమెరాలు, వాటిని ఎడిట్ చేసేందుకు హై ఎండ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్.. ఇలా లేటెస్ట్ టెక్నాలజీతో దురాగతాల్ని రికార్డు చేసి నెట్లో అప్లోడ్ చేసేవాడని, దాదాపు 500కు పైగా అశ్లీల వీడియోల్ని స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిపై ఐటీ యాక్ట్ తో పాటు లైంగికదాడి కోణంలోనూ కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు చెప్పారు. వీడియోలు ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో చిత్రీకరించారో తెలుసుకోవడం కష్టంగా మారడంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఫోరెన్సిక్ సాఫ్ట్ వేర్ సహాయంతో వీడియోస్ అప్ లోడ్ చేసేవాళ్ల కోసం వేటాడాం. ఆ క్రమంలోనే కౌశిక్ కునార్ దొరికిపోయాడని సీబీఐ అధికారులు పేర్కొన్నారు.
మహిళలను తీవ్రంగా హింసించి, ఆపై అత్యాచారం జరిపి, ఆ దృశ్యాల్ని ఇంటర్ నెట్ లోకి పంపుతున్న ఉదంతాలపై హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఓ స్వచ్ఛంద సంస్థ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తూకు లేఖ రాసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన కేసులను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. అనంతరం అశ్లీల వీడియోలపై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది.