కేజ్రీవాల్ సెక్రటరీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణల కేసులో కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రాజేంద్రకుమార్ కేసులో మరిన్ని ఆధారాలను జతచేస్తున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ప్రభుత్వంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఫైళ్లలో పలు అవకతవకలు గుర్తించామని సీబీఐ అధికారులు వెల్లడించారు. విచారణ సందర్భంగా దీనిపై మరింత స్పష్టత వస్తుందని సీబీఐ తెలిపింది.
రాజేంద్రకుమార్ 2009 నుంచి 2014 వరకు ఢిల్లీ ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన టెండర్ల వ్యవహారంలో ఆయన అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయనతో పాటు మరి కొందరు అధికారులకు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు సీబీఐ భావిస్తోంది. రాజేంద్ర కుమార్ కార్యాలయంతో పాటు ఇంటిపై దాడులు నిర్వహించిన సీబీఐ పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.