
న్యూఢిల్లీ: జనగణన సమయంలో కుటుంబ పెద్ద మొబైల్ నెంబర్ వివరాలను కూడా సమాచారం కోసం వచ్చిన ఉద్యోగులకు(ఎన్యూమరేటర్లు) ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 31 ప్రశ్నలకు సంబంధించి సమాచారాన్ని సేకరించాల్సిందిగా జనగణన అధికారులను ఆదేశించామని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, మొబైల్ నెంబర్‌ను జనగణనకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి మాత్రమే వినియోగిస్తామని, మరే ఇతర అవసరాలకు వాడబోమని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇతర ప్రశ్నలతో పాటు కుటుంబపెద్ద ఫోన్ నెంబర్, ఇంట్లో ఉన్న టాయిలెట్లు, టీవీ, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్, సొంత వాహనాలు, కంప్యూటర్, ల్యాప్‌టాప్, తాగు నీటి వసతి.. తదితర సమాచారాన్ని ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. ఏప్రిల్ 1–సెప్టెంబర్ 30 మధ్యలో కుటుంబ సమాచార సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. కుటుంబ పెద్ద ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతర ఏ సామాజిక వర్గానికి చెందుతారనే వివరాలూ సేకరిస్తారు. ఇల్లు సొంతమా?, ఇంట్లోని గదులెన్ని? ముఖ్యమైన ఆహారం ఏమిటి?, వంటకు వాడే ఇంధనం ఏమిటి? తదితర ప్రశ్నలు కూడా ఉంటాయి. ఈ సారి పేపర్‌పై కాకుండా ఈ వివరాలన్నింటినీ మొబైల్ యాప్‌లో నిక్షిప్తం చేస్తారు. జనగణనతో పాటు జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను కూడా రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది.