ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతున్నందున... జనాభా లెక్కలు తీసే ప్రక్రియ ఈ ఏడాది మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే జాతీయ పౌర పట్టిక (ఎన్‌పీఆర్)లో తాజా వివరాలు నమోదు చేసే ప్రక్రియ కూడా ఇప్పట్లో ఉండకపోవచ్చు. ప్రతి పదేళ్లకు ఒకసారి భారతదేశంలో జరిగే జనగణన ప్రపంచంలోనే అతిపెద్ద గణాంక సేకరణ. దేశంలోని మూలమూలలో ప్రతి ఇంటికి వెళ్లి జనాభా వివరాలను సేకరించే పనిలో ఏకంగా 30 లక్షల మంది ప్రభుత్వ సిబ్బంది పాల్గొంటారు. ‘జనగణన ఇప్పుడు అంత ముఖ్యమైన అంశం కాదు. ఏడాది ఆలస్యమైనా వచ్చే నష్టమేమీ లేదు’ అని కేంద్ర గణాంకశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
2021 జనగణన మొదటిదశను ఎప్పుడు ప్రారంభించాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకోనప్పటికీ... ఈ ఏడాది మాత్రం మొదలయ్యే అవకాశాల్లేవని వెల్లడించారు. వాస్తవానికి జనగణన, ఎన్‌పీఆర్ నవీకరణ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు జరగాల్సి ఉంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌పీఆర్ నవీకరణను వ్యతిరేకించినా... జనగణనకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పాయి. అయితే కోవిడ్ సంక్షోభం కారణంగా జనగణనను వాయిదా వేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించాలి కాబట్టి సిబ్బందికి ఉండే ఆరోగ్యపరమైన ముప్పును తక్కువ చేయలేమని ఆ అధికారి చెప్పారు. (ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment