న్యూఢిల్లీ: కరోనా కేసులు అత్యధికంగా నమోదైన జిల్లాల్లోని ఆసుపత్రుల్లో ఇన్‌ఫెక్షన్ నివారణ చర్యలు సక్రమంగా చేపట్టక పోవడం వల్ల వైద్య సిబ్బంది రక్షణ ఆందోళనకరంగా మారిందని కేంద్ర వైద్య బృందం అభిప్రాయపడింది. కోవిడ్–19ని ఎదుర్కోవడంలో వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖల సంసిద్ధతను సమీక్షించేందుకు కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆరు ఉన్నత స్థాయి బృందాలను ఏర్పాటు చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సీడీసీ), ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లకు చెందిన ఈ నిపుణుల బృందాలు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులలో అత్యధిక కోవిడ్ కేసులున్న జిల్లాల్లో పర్యటించాయి.
కరోనా వైరస్ సోకిన వారికి పరీక్షలు నిర్వహించేందుకు శాంపిల్స్ సేకరించేటప్పుడు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం లేదనీ, దీంతో ఆరోగ్య కార్యకర్తలకు వైరస్ సోకుతోందనీ, తద్వారా ఇతరలుకు సైతం ఇది పాకుతోందని ఈ బృందాలు గుర్తించాయి. శాంపిల్స్ తీసుకొనేటప్పుడు, వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపేటప్పుడూ నిర్దిష్ట ఉష్ణోగ్రతల్లో భద్రపరిచాలని వారు సూచించారు. కంటైన్‌మెంట్ జోన్‌లలో ఇంటింటి సర్వే నిర్వహించేందుకు తగినంత మంది సిబ్బందిని నియమించాలని ఈ బృందం సూచించింది. ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు ఉద్దేశించిన మార్గదర్శకాలను ఆసుపత్రులు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర బృందాలు స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment