సాక్షి, హైదరాబాద్: కరోనా (కోవిడ్-19) వైరస్‌పై అంటువ్యాధుల నివారణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించింది. ఈ మేరకు అంటువ్యాధుల నియంత్రణ చట్టం–1897కు అనుగుణంగా తెలంగాణ అంటువ్యాధుల (కోవిడ్) నియంత్రణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం రాత్రి విడుదల చేసింది. దాని ప్రకారం ఎవరైనా కోవిడ్ అనుమానిత లక్షణాలుండి ఆస్పత్రిలో చేరేందుకు కానీ, ఐసోలేషన్‌లో ఉండేందుకు కానీ నిరాకరిస్తే ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు పెట్టాలని స్పష్టం చేసింది. వీటిని అమలు చేసే బాధ్యతలను కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు, ప్రజారోగ్య డైరెక్టర్, డీఎంఈ, వైద్య విధాన కమిషనర్లకు ప్రత్యేక అధికారాలు కల్పించింది.
తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని, ఇది ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్‌ను మహమ్మారిగా ప్రకటించినందున, దాని నియంత్రణకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు తమ వద్దకు వచ్చే కోవిడ్ అనుమానాస్పద కేసులను పరీక్షించి, పైన పేర్కొన్న అధికారులకు సమాచారం అందించాలి. వ్యక్తుల ప్రయాణ చరిత్రను తెలుసుకోవాలి. ఆ వివరాలను నమోదు చేయాలి.
- అవసరమైనప్పుడు పైన పేర్కొన్న అధికారులు ఆదేశిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ కోవిడ్ నిర్ధారణకు సంబంధించిన విభాగాలు ఏర్పాటు చేసుకొని అనుమానిత కేసులకు పరీక్షలు నిర్వహించాలి.
- గత 14 రోజుల్లో ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చారా లేదా తెలుసుకోవాలి. ప్రయాణ చరిత్ర ఉన్నా లేకపోయినా వారు 14 రోజులు ఇంటి నిర్బంధంలో ఉండాలి. లక్షణాలుంటే ఆస్పత్రికి తరలించాలి. కేంద్రం జారీచేసిన గృహ నిర్బంధ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి.
- గృహ నిర్బంధ మార్గదర్శకాలను పాటించని వ్యక్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో ఉంచాలి.
- ప్రయాణ చరిత్ర, లక్షణాలతో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రొటోకాల్ ప్రకారం ఆస్పత్రిలో ఉంచాలి.
- అలాంటి కేసులన్నింటినీ వెంటనే రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ యూనిట్‌కు పంపాలి. జిల్లా కలెక్టర్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు సమాచారం ఇవ్వాలి.
- కలెక్టర్ లేదా ప్రజారోగ్య డైరెక్టర్ తదితరుల అనుమతి లేకుండా, వారు కేసులను నిర్ధారణ చేయకుండా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, ముద్రించడం తగదు. అవాస్తవాలను ప్రచారం చేస్తే, పుకార్లను వ్యాపింపజేస్తే ఈ నిబంధనల ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.
- కోవిడ్‌ను పరీక్షించాలనుకునే ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ సంస్థలు రాష్ట్ర ఐడీఎస్పీ యూనిట్‌కు తెలపాలి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ఐడీఎస్పీ యూనిట్ వీటిని పర్యవేక్షిస్తుంది.
- కోవిడ్ ప్రభావిత దేశం లేదా ప్రాంతం నుంచి గత 14 రోజుల్లో ప్రయాణ చరిత్ర ఉన్న ఎవరైనా, స్వచ్ఛందంగా స్టేట్ కంట్రోల్ రూం (040–24651119) లేదా టోల్ ఫ్రీ నంబర్ 104కు సమాచారం ఇవ్వాలి.
- కోవిడ్ లక్షణాలున్న వారు ఐసోలేషన్‌కు నిరాకరిస్తే, ఆస్పత్రికి రావడానికి ఇబ్బందిపెడితే ఆ వ్యక్తిపై చట్టప్రకారం చర్యలుంటాయి.
- జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తదితరులకు అనేక అధికారాలు ఇచ్చారు. తమ పరిధిలో కోవిడ్ వ్యాప్తి జరగకుండా చర్యలు తీసుకోవాలి. సినిమా హాళ్ల మూసివేత, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, సామూహిక సమావేశాలను నిషేధించడం, పాఠశాలలు, కార్యాలయాలను మూసేయాలి.
- ఈ నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తి, సంస్థలను శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్లుగా పరిగణిస్తారు. అవసరమైతే జరిమానా విధించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment