సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో దెబ్బతినే రంగాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మన ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలసిందే. టాస్క్‌ఫోర్స్ సూచనలకు అనుగుణంగా ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రభుత్వం వెల్లడించనుంది. ఇక కరోనాను కట్టడి చేసేందుకు వచ్చే విరాళాలను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పరిగణిస్తామని నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రకటించారు.
మరోవైపు కరోనాను నియంత్రించేందుకు దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆర్థిక ప్యాకేజ్‌ను ప్రకటించాలని పార్లమెంట్‌లో విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది. దేశంలోని 80 జిల్లాలు పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉండగా ఆయా ప్రాంతాల్లో కేవలం నిత్యావసర సేవలను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. పంజాబ్, హరియాణ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment