లాలు కూతురికి కష్టాలు.. సీఏ అరెస్టు
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ కుమార్తె మీసాభారతికి కష్టాలు ముంచుకొచ్చాయి. ఆమె దగ్గర చార్టర్డ్ అకౌంటెంటుగా పనిచేస్తున్న రాజేశ్ అగర్వాల్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టుచేసి ఢిల్లీలోని ఒక కోర్టులో ప్రవేశపెట్టారు. న్యూఢిల్లీలోని బిజ్వసాన్ ప్రాంతంలోని ఒక ఫాంహౌస్ కొనుగోలు చేయడానికి ఒక షెల్ కంపెనీ ద్వారా మీసాభారతి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ గత వారం ఆరోపించారు. ఆ కంపెనీ షేర్ల అమ్మకాలు, కొనుగోళ్ల పేరు మీద మీసాభారతి తన దగ్గర ఉన్న నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్నారని ఆయన చెప్పారు. 2002 సంవత్సరంలో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో మిషాలి ప్యాకర్స్ అండ్ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని పెట్టారని, దానికి చిరునామాను కూడా నాటి లాలు అధికార నివాసం అయిన నెం.25, తుగ్లక్‌రోడ్ బంగ్లాను చూపించారని, ఆ తర్వాత 2005-06లో ఆ కంపెనీ మూసేశారని మోదీ తెలిపారు.
రూ. 10 ముఖవిలువ గల తన కంపెనీ షేర్లను షాలిని హోల్డింగ్స్ యజమాని వీరేంద్ర జైన్‌కు రూ. 100 చొపఉపన 2008 అక్టోబర్ నెలలో మీసాభారతి అమ్మారు. తద‍్వారా రూ. 1.20 కోట్లను అక్రమంగా కూడబెట్టారన్నది ప్రధాన ఆరోపణ. 11 నెలల తర్వాత ఆమె మళ్లీ జైన్ నుంచి అవే షేర్లను రూ. 10 చొప్పున కొన్నారని చెప్పిన మోదీ.. దానికి సంబంధించిన పత్రాలను కూడా చూపించారు. 2008-09 సంవత్సరంలో ఆమె ఢిల్లీలో రూ. 1.41 కోట్లతో ఫాంహౌస్ కొన్నారని, దాని ప్రస్తుత విలువ సుమారు రూ. 50 కోట్లు ఉంటుందని వివరించారు. కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో రూ. 50 కోట్లు సంపాదించడం ఇంకెవరికైనా సాధ్యమా అని ఆయన అడిగారు. మోదీ ఆరోపణల నేపథ్యంలోనే మీసాభారతి చార్టర్డ్ అకౌంటెంట్ రాజేశ్ అగర్వాల్‌ను పట్టుకున్నారా, మరేవైనా ఇతర ఆధారాలున్నాయా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది.