కూతురికి, భార్యకు రాజ్యసభ సీట్లు!
బిహార్ అంటే... అందునా లాలు ప్రసాద్ అంటే కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇప్పటికే ఆయన ఇద్దరు కొడుకులు రాష్ట్రంలో మంత్రులు. అందులోనూ చిన్నకొడుకు ఉప ముఖ్యమంత్రి కూడా. అయితే, ఇంతకుముందు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తన భార్య, గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తన కూతురు మాత్రం రాజకీయ నిరుద్యోగులుగా ఎందుకు ఉండాలి అనుకున్నారేమో గానీ.. వాళ్లిద్దరినీ రాజ్యసభకు పంపాలని లాలు నిర్ణయించేశారు. వచ్చే సంవత్సరం బిహార్ నుంచి రాజ్యసభకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి వీళ్లిద్దరినీ ఎంపిక చేశారు. రబ్రీదేవికి, మీసా భారతికి రాజ్యసభ సీట్లు ఖాయమని ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు గెలుచుకోవడంతో ఆర్జేడీ సులభంగా రెండు రాజ్యసభ స్థానాలను పొందుతుంది. ఒక్కో అభ్యర్థికి అసెంబ్లీ నుంచి కేవలం 41 ఓట్లు వస్తే చాలు. అంటే, మిత్రపక్షాలైన జేడీ(యూ) లేదా కాంగ్రెస్ నుంచి ఇద్దరు తమవాళ్లకు ఓట్లేస్తే చాలని లాలు చూస్తున్నారు. జేడీ(యూ)కు చెందిన ఐదుగురు ఎంపీలు 2016 జూలైలో రిటైర్ కానున్నారు.
తాను జాతీయస్థాయిలో పనిచేస్తానని, తమ్ముడు నితీష్ బిహార్‌ను చూసుకుంటాడని లాలు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఢిల్లీలో ప్రభుత్వ బంగ్లా కావాలి గానీ.. తాను ఎటూ ఎన్నిక కాలేడు కాబట్టి భార్యను, కూతురిని పంపాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. రబ్రీదేవి ఎటూ మాజీ సీఎం కాబట్టి, ఆమెకు పెద్ద బంగ్లానే వస్తుంది. మీసాభారతి మాత్రం రాజకీయ పదవి పొందడం ఇదే తొలిసారి అవుతుంది. అది కూడా నేరుగా రాజ్యసభకు వెళ్లడం విశేషం. 2014 ఎన్నికల్లో ఆమె పాటలీపుత్ర స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేసింది. కానీ, అప్పటివరకు లాలుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన రామ్ కృపాల్ బీజేపీలోకి వెళ్లి, ఆమెను ఓడించారు. కానీ మీసాభారతిని ఎలాగైనా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉన్న లాలు.. ఇప్పుడు అవకాశం రావడంతో పెద్దల సభకు పంపేస్తున్నారు.