
న్యూఢిల్లీ : పాక్ చెరలో ఉన్న భారత వాయుసేన(ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుండగా.. ఆయనకు స్వాగతం పలికేందుకు బయలు దేరిన అభినందన్ తల్లిదండ్రుల పట్ల సాధారణ పౌరులు తమ గౌరవాన్ని చాటుకున్నారు. గురువారం అర్థరాత్రి చెన్నై నుంచి ఢిల్లీ విమానంలో అమృత్‌సర్‌కు బయలుదేరిన అభినందన్ తల్లిదండ్రులు విమానంలోకి రాగా.. తోటి ప్రయాణీకులంతా లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. దేశం గర్వించే హీరోను కన్నారంటూ నినాదాలు చేసి తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడితో తలొగ్గిన దాయాది దేశం పాకిస్తాన్ అభినందన్‌ను నేడు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. భారత గగనతంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానాలను తిప్పికొట్టే ప్రయత్నంలో ప్రత్యర్థి భూభాగంలో కూలిన మిగ్–21 బైసన్ విమాన పైలట్‌గా అభినందన్ ఆ దేశ సైనికుల చేతికి చిక్కాడు. పాక్ సైన్యం ఎన్ని చిత్రహింసలు పెట్టినా బాధను పంటిబిగువన దిగమింగుతూ ప్రశాంత చిత్తంతో కనిపించిన వీరుడు.. విక్రమ్ అభినందన్ చూపించిన తెగువ, సాహసానికి యావద్భారతం సెల్యూట్ చేస్తోంది. ఆయన రాకకోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది.