సాక్షి, న్యూఢిల్లీ: తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఆగస్టు 31న జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాల్సిందిగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ దాఖలు చేసుకున్న దరఖాస్తును కేంద్ర హోంశాఖ కొట్టేసింది. ఆయన దరఖాస్తులో ఎలాంటి సమర్థనీయమైన అంశాలు లేవంటూ హోంశాఖలోని పౌరసత్వ విభాగ అదనపు కార్యదర్శి బి.ఆర్.శర్మ ఈ నెల 13న ఉత్తర్వులు జారీ చేశారు. భారత పౌరసత్వం పొందేందుకు చేసుకునే దరఖాస్తుకు ముందు దేశంలో ఏడాదిపాటు నివసించి ఉండాలని, కానీ చెన్నమనేని వాస్తవాలను దాచిపెట్టి మోసపూరితంగా పౌరసత్వం పొందారని హోంశాఖ మండిపడింది. దీనిపై పూర్తి ఆధారాలతోనే ఆగస్టు 31న ఉత్తర్వులు జారీ చేశామని తెలిపింది. ప్రజాసంక్షేమానికి పాటుపడిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చెన్నమనేని కోరారని, అయితే ఈ అంశాన్ని తాము గతంలోనే పరిశీలించామని వివరించింది. ప్రజాప్రతినిధిగా ఇతరులకు ఆదర్శంగా నిలిచేందుకు ఆయన సమాజం, దేశంపట్ల మరింత నిజాయితీతో వ్యవహరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది.
సాగుతున్న వివాదం...
జర్మనీ వలసవెళ్లి ఆ దేశ పౌరసత్వం పొందిన చెన్నమనేని రమేశ్ తప్పుడు ధ్రువపత్రాలతో 2008లో తిరిగి భారత పౌరసత్వం పొందినందున ఆయన ఎన్నిక చెల్లదంటూ ఎన్నికల్లో ఆయన సమీప ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో చెన్నమనేని పౌరసత్వం చెల్లదంటూ హైకోర్టు 2013లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ చెన్నమనేని సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే పొందగా స్టే తొలగించాలని ఆది శ్రీనివాస్ సుప్రీంలో న్యాయ పోరాటం చేశారు. 2016 డిసెంబర్‌లో ఈఅంశంపై దర్యాప్తు చేయాలని హోంశాఖను సుప్రీం ఆదేశించింది. దీంతో కేంద్ర హోంశాఖ ఆగస్టు 31న చెన్నమనేని పౌరసత్వంపై నిర్ణయాన్ని ప్రకటించింది.
రాజీనామా చేయాలి: ఆది శ్రీనివాస్
తన పౌరసత్వానికి సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన చెన్నమనేని రమేశ్ దేశాన్ని అగౌరవపరిచారని బీజేపీ నేత ఆది శ్రీనివాస్ విమర్శించారు. చెన్నమనేని భారత పౌరుడు కాదని హైకోర్టు, కేంద్ర హోంశాఖ మూడు సార్లు స్పష్టం చేశాయన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశాన్ని అగౌరవపరిచిన చెన్నమనేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని లేదా ప్రభుత్వమే ఆయన్ను తప్పించాలని డిమాండ్ చేశారు.
మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తా
పౌరసత్వ వివాదంపై చెన్నమనేని
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల: చట్టరీత్యా నిబంధనలు సంపూర్ణంగా తనవైపు ఉన్నందున మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పేర్కొన్నారు. ఆగస్టు 31న కేంద్ర హోంశాఖ ఏ నోటీసు లేకుండా తన పౌరసత్వాన్ని రద్దు చేసిందని, దీంతో హైకోర్టును ఆశ్రయించి తన వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరినట్లు గుర్తు చేశారు. తన వాదనలను, కొత్తగా ఇచ్చే సాక్ష్యాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు హోం శాఖకు సూచించిందన్నారు. దీంతో మూడు పర్యాయాలు తన వాదనలు వినిపించానని, సుమారు నూరు పేజీల వివరణ కూడా సమర్పించానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment