'మా అన్నను కలుస్తాం.. అనుమతించరూ..'!
న్యూఢిల్లీ: ఇండోనేషియాలోని బాలిలో అరెస్టయి ప్రస్తుతం ఢిల్లీలో సీబీఐ అధికారుల అదుపులో ఉన్న చోటా రాజన్ను కలిసేందుకు ఆయన సోదరిమణులు వచ్చారు. శుక్రవారం తన సోదరుడిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన ఇద్దరు సోదరీలు సీబీఐ కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
అండర్‌వరల్డ్ డాన్, గ్యాంగ్‌స్టర్ అయిన చోటా రాజన్ ను అరెస్టు చేసేందుకు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో అతడిని ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ద్వీపం బాలిలో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి బాలికి వచ్చిన రాజన్‌ను ఆస్ట్రేలియా పోలీసులిచ్చిన సమాచారంతో బాలి విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. అంతర్జాతీయంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడైన రాజన్ మరో ప్రముఖ డాన్ దావూద్ ఇబ్రహీంకు ఒకప్పుడు కుడిభుజం.. దావూద్ డీ కంపెనీలో నంబర్ 2 పొజిషన్ లో ఉన్నాడు. అయితే 1993 ముంబై పేలుళ్ల అనంతరం దావూద్‌కు, డీ కంపెనీకి ప్రధాన ప్రత్యర్థిగా మారాడు.