న్యూఢిల్లీ: భారత్, చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో ఘర్షణలు చోటుచేసుకున్న అనంతరం భారత్‌కు చెందిన వెబ్‌సైట్లపైన చైనా హ్యాకర్ల దాడులు భారీ స్థాయిలో పెరిగినట్లు సింగపూర్ సంస్థ ఒకటి వెల్లడించింది. జూన్ 18వ తేదీ తర్వాత చైనా ఆర్మీ(పీఎల్‌ఏ)మద్దతు ఉన్న హ్యాకర్ల దాడులు ఒక్కసారిగా 300 శాతం మేర పెరిగాయని సైబర్ రీసెర్చ్ సంస్థ సైఫర్మా వెల్లడించింది. రెండు దేశాల సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో జూన్ 15, 16వ తేదీల్లో ఘర్షణలు జరగ్గా ఆ తర్వాత నుంచి భారత వెబ్‌సైట్లే లక్ష్యంగా చైనా హ్యాకర్ల దాడుల్లో తీవ్రత, దూకుడు బాగా పెరిగినట్లు గుర్తించామని సైఫర్మా సీఎండీ కుమార్ రితేశ్ తాజాగా ‘ఇండియాటుడే’కు ఇచ్చిన ఇంటర్వూ్యలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ కంప్యూటర్ రెస్పాన్స్ టీం(సీఈఆర్టీ)తో పంచుకున్నట్లు ఆయన వివరించారు.
‘హ్యాకర్లు మొదటి దశలో నిఘా వేసి భారత వెబ్‌సైట్ల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. దాని ఆధారంగా వారు లక్ష్యాలను నిర్ధారించుకుంటారు. రెండో దశలో సైబర్ దాడులకు పాల్పడే అవకాశాలున్నాయి’అని ఆయన తెలిపారు.‘జూన్ 18వ తేదీకి ముందు చైనా హ్యాకర్లు మొబైల్ ఫోన్ల తయారీ, నిర్మాణరంగం, టైర్లు, మీడియా కంపెనీలు, ఇతర ప్రభుత్వ రంగ ఏజెన్సీల వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకునే వారు. కానీ, ఆ తర్వాత నుంచి మాత్రం వెబ్‌సైట్లను పాడుచేయడం, వాటి ప్రతిష్టను దిగజార్చడం నుంచి కీలకమైన సమాచారాన్ని, సున్నితమైన వివరాలను, వినియోగదారుల డేటాను, మేధోహక్కులను దొంగిలించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు’అని వెల్లడించారు. ‘గతంలో పాకిస్తాన్, ఉత్తరకొరియా హ్యాకర్ల ద్వారా చైనా హ్యాకర్లు కార్యకలాపాలు సాగించేవారు. ఇప్పుడు వారే నేరుగా హ్యాకింగ్‌లో పాలుపంచుకుంటున్నారు. భారతీయ సంస్థల కీలక సమాచారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు’అని కుమార్ రితేశ్ పేర్కొన్నారు.
ముఖ్యంగా చైనాలోని బీజింగ్, గ్వాంగ్‌ఝౌ, షెంజెన్, చెంగ్డులోని స్థావరాల నుంచి సైబర్ దాడులు ఎక్కువగా జరిగినట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు. ప్రభుత్వ అండతో నడిచే గోధిక్ పాండా, స్టోన్ పాండా అనే హ్యాకింగ్ ఏజెన్సీలు తమ ఉనికి బయటపడకుండా ఉండేందుకు చైనాకు బదులుగా అమెరికా, యూరప్, ఇతర ఆసియా దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. చైనా ఆర్మీకి చెందిన మౌలిక వసతులను ఇవి ఉపయోగించుకుంటాయి. ‘ప్రభుత్వ ప్రేరేపిత హ్యాకర్లు భారత్‌పై ఎప్పటి నుంచో కన్నేసి ఉంచారు. జూన్ తర్వాత వారి వైఖరిలో మార్పు వచ్చింది. వారి సంభాషణను డీకోడ్ చేయగా తరచుగా ‘భారత్‌కు గుణపాఠం చెప్పాలి’వంటివి ఎక్కువగా వాడుతున్నట్లు తేలింది.
ప్రభుత్వ ప్రోద్బలంతో నడిచే హ్యాకింగ్ సంస్థలకు భౌగోళిక రాజకీయ లక్ష్యాలు ఉండేవి. కానీ, చైనా హ్యాకర్ల లక్ష్యం వాళ్ల పరిశ్రమలను కాపాడుకోవడమే’అని ఆయన తెలిపారు. ‘ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన, అంతర్జాతీయంగా మంచి పేరున్న భారతీయ సంస్థలే చైనా హ్యాకర్ల ప్రస్తుత లక్ష్యం. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు మౌలిక వసతులను మెరుగుపర్చుతున్నప్పటికీ హ్యాకర్లు అంతకంటే ముందుంటున్నారు. నోడల్ ఆర్గనైజేషన్ నుంచి మిగతా సంస్థలకు సమాచారం అందజేత నెమ్మదిగా సాగుతోంది. సైబర్ దాడులను ఎదుర్కోవాలంటే మాత్రం సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం సత్వరమే జరిగిపోవాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు
Comments
Please login to add a commentAdd a comment