భారత్, చైనా మిలటరీ చర్చలు | India China Borders Not Yet Decided Says China | Sakshi
Sakshi News home page

భారత్, చైనా మిలటరీ చర్చలు

Published Wed, Sep 2 2020 3:29 AM | Last Updated on Wed, Sep 2 2020 3:29 AM

India China Borders Not Yet Decided Says China - Sakshi

శ్రీనగర్‌–లెహ్‌ హైవేపై గగన్‌గీర్‌ వద్ద సైనిక ట్రక్కుల కాన్వాయ్‌

న్యూఢిల్లీ: సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌లో తాజాగా నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారత్, చైనా మరో దఫా సైనిక చర్చలు చేపట్టాయి. సరిహద్దులో భారత్‌ వైపున్న చుషుల్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు బ్రిగేడ్‌ కమాండర్‌ స్థాయి అధికారుల చర్చలు ప్రారంభమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాంగాంగ్‌ సరస్సు వద్ద యథాతథ స్థితిని కొనసాగిం చాలన్న నిర్ణయానికి తూట్లు పొడుస్తూ సోమవారం చైనా మిలిటరీ దుస్సాహసానికి దిగిన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో చైనా బలగాలు భారత్‌ వైపునకు చొచ్చుకొని వచ్చి దురాక్రమణకు యత్నించాయి.

రాజ్‌నాథ్‌ సమీక్ష 
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ లద్దాఖ్‌లో పరిస్థితులపై మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్, త్రివిధ దళాల అధిపతులు దీనికి హాజరయ్యారు. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలోని కీలక ప్రాంతాలకు అదనపు బలగాలను, ఆయుధ సంపత్తిని తరలించారు. ఈ ప్రాంతంలో భారత్‌ ఆధిపత్యం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. వాస్తవా ధీన రేఖ వద్ద గగనతలంలో చైనా కదలికలపై నిఘాను మరింత పెంచాలని భారత వాయుసేనకు ఆదేశాలు వెళ్లినట్లు చెప్పాయి. 

అందుకే వివాదాలు: చైనా మంత్రి 
భారత్, చైనా సరిహద్దులో ఒకవైపు ఉద్రిక్తతలు నెలకొనగా మరోవైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా సరిహద్దుల్ని ఇంకా నిర్ణయించలేదని, అందుకే ఎప్పుడూ సమస్యలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించా రు. ఇరు దేశాల నాయకత్వం  విభేదాలు వివాదాలుగా మారకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు. భారత్‌తో అన్ని అంశాలపై చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.  

ఒప్పందాల ఉల్లంఘనే: భారత్‌ 
తాజాగా చైనా బలగాలు వాస్తవాధీన రేఖ వద్ద పాల్పడిన దుందుడుకు చర్యపై భారత్‌ స్పందించింది. పాంగాంగ్‌ దక్షిణ తీరంలో యథాతథ స్థితిని పాటించాలంటూ కుదిరిన ఒప్పందాలను చైనా లక్ష్యపెట్టలేదని స్పష్టం చేసింది. ఆగస్టు 29, 30న పాంగాంగ్‌ దక్షిణ తీరంలో ఆ దేశ  బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయంది. ఒప్పందాలను గౌరవించకుండా చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు దిగిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ  చెప్పారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ ఏసీ) వద్ద దేశ ప్రయోజనాలను, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు భారత బలగాలు సరైన రక్షణాత్మక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సరిహద్దులో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు   ఇరుదేశాల కమాండర్లు చర్చలు జరుపుతుండగానే చైనా కవ్వింపు చర్యలకు దిగిందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement