న్యూఢిల్లీ: చైనా ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. భారత్‌తో నేరుగా తలపడలేని డ్రాగన్ దేశం హైబ్రిడ్ యుద్ధానికి (మిలటరీయేతర సాధనాలతో ప్రత్యర్థులపై పట్టు బిగించడం) తెరతీసింది. దేశంలో ప్రముఖుల కార్యకలాపాలపై కన్నేసి సైబర్ నేరాలకు పాల్పడుతోంది. భారత్‌లో 72 సర్వర్ల ద్వారా వినియోగదారుల డేటా చైనాకి చేరిపోతోంది. చైనాకు చెందిన టెక్నాలజీ గ్రూప్ అలీబాబా సంస్థ క్లౌడ్ డేటా సర్వర్ల ద్వారా మన దేశంలో ప్రముఖులకు సంబంధించిన అన్ని వివరాలు ఎప్పటికప్పుడు చైనాకి చేరిపోతున్నట్టుగా ఇంటెలిజెన్స్ అధికారులు ఒక ఆంగ్ల వెబ్‌సైట్‌కి వెల్లడించారు. మన దేశ వాణిజ్య రంగంలో అలీబాబా క్లౌడ్ డేటాకి ఆదరణ ఎక్కువగా ఉంది. యూరోపియన్ సర్వర్ల కంటే అలీబాబా తక్కువ ధరకే సర్వర్ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు ఆ సంస్థే భారత్ నుంచి డేటా చౌర్యానికి పాల్పడుతోందని తేలింది. 72 డేటా సర్వర్ల ద్వారా చైనాకి సమాచారం వెళుతున్నట్టు ఇప్పటివరకు గుర్తించామని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
పథకం ప్రకారమే చైనా కుట్ర
తమ దేశానికి చెందిన టెక్నాలజీ సంస్థల ద్వారా చైనా అధికారులు భారీ ఎత్తున డేటా చౌర్యానికి పాల్పడుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ‘ఇదంతా అలీబాబా సంస్థ పథకం ప్రకారమే చేస్తోంది. మొదట ఫ్రీ ట్రయల్ అని కంపెనీలకు ఎర వేస్తుంది. కంపెనీలు అలీబాబా సర్వర్లని సబ్‌స్క్రైబ్ చేసుకోగానే కీలకమైన సమాచారాన్నంతా చైనాలో మారుమూల సర్వర్లకు చేరవేస్తోంది’ అని ఆ వర్గాలు తెలిపాయి.
త్వరలో సమగ్ర విచారణ
చైనా సైబర్ చౌర్యంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో సమగ్రమైన విచారణ చేపట్టనుంది. డ్రాగన్ దేశం హైబ్రిడ్ యుద్ధానికి తెరలేపిన నేపథ్యంలో చైనాకు చెందిన 200 యాప్‌లను కేంద్రం నిషేధించినట్టుగా ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతూనే దేశంలో ప్రముఖుల డేటా చౌర్యానికి పాల్పడుతూ ఉండడంతో కేంద్రం లోతైన దర్యాప్తుని చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment