![Rival Military Continues Build Ups While Third Round Talks Continue - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/1/India.jpg.webp?itok=MiSF8Y9Y)
న్యూఢిల్లీ: ఒకవైపు బలగాల ఉపసంహరణే లక్ష్యంగా భారత్‌తో చర్చలు కొనసాగిస్తూనే భారీగా చైనా సైన్యాన్ని మోహరిస్తోంది. గతంలో రెండు దేశాల సైన్యం పెట్రోలింగ్ చేపట్టి, తాజాగా చైనా శాశ్వత శిబిరాలు ఏర్పాటుచేసిన పాంగాంగ్ త్సోలోని ఫింగర్4 వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వివాదాస్పదంగా ఉన్న ఈ భూభాగం మీదుగా మరింత తూర్పువైపు భారత భూభాగంలోకి రావడమే డ్రాగన్ లక్ష్యం. దీనిని పసిగట్టిన భారత్ భారీ మోహరింపులతో ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంది. తూర్పు లద్దాఖ్‌లోని మరో మూడు వివాదాస్పద ప్రాంతాల్లోనూ సైనిక సమీకరణలు జరుగుతున్నాయి. గడిచిన 72 గంటల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి రెండు దేశాలు సైన్యాలను పెద్ద ఎత్తున తరలించాయి.చైనా పాంగాంగ్ త్సో, హాట్ స్ప్రింగ్స్ ఏరియాలో మోహరింపులు చేపట్టింది.
గల్వాన్ లోయలోని పెట్రోల్ పాయింట్ 14(జూన్ 15న తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతం), పెట్రోల్ పాయింట్లు 15, 17ఏల వద్ద కూడా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. పాంగాంగ్ త్సోతో పోలిస్తే గల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్‌లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ప్రస్తుతానికి చైనా ఆయుధ సంపత్తి, బలగాలకు దీటుగా భారత్ స్పందిస్తోంది. క్షిపణి రక్షణ వ్యవస్థ, ఆధునిక యుద్ధ విమానాలతో గస్తీని ముమ్మరం చేసింది. ఈ పరిస్థితుల్లో రెండు దేశాల సైనిక సమీకరణలతో చర్చలు కూడా మరికొంతకాలం కొనసాగే అవకాశాలున్నాయి. అప్పటి దాకా అంటే మరో మూడు నెలల వరకు శీతాకాలం వచ్చే దాకా ఇదే తీరు కొనసాగవచ్చు. కఠినమైన చలికాలంలో గల్వాన్ నది గడ్డకట్టే పరిస్థితుల్లో సరిహద్దుల్లో సైనికుల పోస్టులు, గస్తీ కొనసాగేందుకు ఎలాంటి అవకాశాలు ఉండవు. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న భారీ సమీకరణలను చూస్తే.. రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం తగ్గిందని, వెనక్కి తగ్గరాదన్న కృతనిశ్చయాన్ని పెంచిందని అర్థమవుతోంది. దీనికితోడు, చైనా మోబైల్ యాప్‌లపై భారత్ నిషేధం విధించింది.
భారత్, చైనా సుదీర్ఘ చర్చలు
తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఖరారే లక్ష్యంగా భారత్, చైనా లెఫ్టినెంట్ జనరళ్ల స్థాయి చర్చలు సుదీర్ఘంగా సాగాయి. భారత భూభాగంలోని చుషుల్ సెక్టార్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు మొదలైన చర్చలు రాత్రి 9 గంటల తర్వాత కూడా కొనసాగాయని అధికార వర్గాలు తెలిపాయి. యధాతథ స్థితిని కొనసాగించాలని భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment